నిర్మల్, నిజామాబాద్ లో దొంగల హల్ చల్.. మహిళా టీచర్ ను కత్తులతో బెదిరించి చోరీ

నిర్మల్, నిజామాబాద్ లో దొంగల హల్ చల్.. మహిళా టీచర్ ను కత్తులతో బెదిరించి చోరీ

నిర్మల్, వెలుగు: నిర్మల్  పట్టణంలోని శాంతినగర్  క్రాస్  రోడ్డు వద్ద ఉన్న తన్వి అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. అపార్ట్‌‌‌‌మెంట్  మెయిన్​ గేట్​ తాళాన్ని కట్టర్‌‌‌‌తో కట్  చేసి లోపలికి వెళ్లిన దుండగులు ముందుగా 303 ఫ్లాట్  తలుపులు బద్దలు కొట్టారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. విలువైన వస్తువులేవీ దొరకకపోవడంతో, రెండో ఫ్లోర్‌‌‌‌లోని 207 ఫ్లాట్‌‌‌‌లోకి చొరబడ్డారు. 

ఇంట్లో ఉన్న గవర్నమెంట్​ టీచర్​ సరితను కత్తులతో బెదిరించి ఇంట్లోని బంగారు నగలు, రూ.10 వేల నగదు, 20 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. బాధితురాలు వెంటనే తన భర్త ప్రకాశ్  ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సమ్మయ్య చేరుకొని క్లూస్  టీమ్‌‌‌‌ను రంగంలోకి దించారు. నిందితుల వేలిముద్రలను, ఆధారాలను సేకరించారు. సీసీ పుటేజీని పరిశీలించారు.  నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.


టాటా సుమోలో వచ్చి రెండు చోట్ల చైన్​ స్నాచింగ్


నిజామాబాద్: నిజామాబాద్​ జిల్లాలో టాటా సుమోలో వచ్చిన దొంగల ముఠా కలకలం రేపింది. నగరంలో రెండు చోట్ల చైన్​ స్నాచింగ్, ఆర్మూర్​లోని ఓ  ఫ్లాట్, మెడికల్​ షాప్​లో దొంగతనం చేశారు. శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో టాటా సుమోలో వచ్చిన నలుగురు దొంగలు సిటీలోని దుబ్బ ప్రాంతంలో వాకిలి ఊడుస్తున్న ప్రవీణ మెడలోని రెండున్నర తులాల మంగళసూత్రాన్ని తెంపుకెళ్లారు. 

చెవి కమ్మల్లో ఒకటి లాగేసుకొని, మరొకటి లాగే ప్రయత్నం చేస్తున్నప్పుడు మహిళ కేకలు విని ఆమె భర్త బయటకు రావడంతో దొంగలు పరారయ్యారు. ఇద్దరు దొంగలు చైన్​ స్నాచింగ్​కు పాల్పడగా, మరో ఇద్దరు వెహికల్​లోనే ఉన్నారు. అంతకు 10 నిమిషాల ముందు సిటీ శివారులోని శ్రీనివాస్​నగర్​ కాలనీకి చెందిన లక్ష్మి మెడలోని గోల్డ్​ చైన్​ లాక్కొని సుమోలో పరారయ్యారు. మార్నింగ్​ వాక్​ కోసం బయటకు వచ్చిన లక్ష్మీని అడ్రస్​ అడుగుతూ చైన్​ స్నాచింగ్​ చేసి ఉడాయించారు. 

రాత్రి 12 గంటల సమయంలో జిల్లాలోని ఆర్మూర్​లో వినాయక అపార్ట్​మెంట్​లో ఉండే లోక రమేశ్​రెడ్డి ఫ్లాట్​లోని బీరువా పగులగొట్టి 10 తులాల వెండి ఆభరణాలు, నగదు దొంగిలించారు. అనంతరం మెడిసిటీ మెడికల్​ షాప్  షట్టర్​ లాక్​ ధ్వంసం చేసి క్యాష్​ కౌంటర్​లోని రూ.1.90 లక్షల నగదు పట్టుకెళ్లారు. 

ఈ నాలుగు చోట్ల టాటా సుమోలో వచ్చిన నలుగురు దొంగలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యారు. దుబ్బ ఏరియా బాధితురాలి ఇంటికి సీపీ సాయిచైతన్య వెళ్లి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు స్పెషల్​ టీమ్​లు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి నిర్మల్​లో​ దొంగతనాలు చేసిన దొంగల ముఠా సుమోలో హైవే మీదుగా జిల్లాలోకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిర్మల్, నిజామాబాద్​లో ఈ ముఠానే చోరీలు చేసినట్లు భావిస్తున్నారు.