హైదరాబాద్: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సీట్లు పెరిగితే అవి కూడా మేమే గెలుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ అంటున్నారు.. కానీ వన్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ కలిపి 9 సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలవదని ఎద్దేవా చేశారు. ఆదివారం (జులై 12) పటాన్ చెరులో బీఆర్ఎస్ కార్యకర్తల డిజిటల్ మెంబర్షిప్, ఎస్ఐఆర్లపై అవగాహన సదస్సు నిర్వహించారు.
హరీష్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా అన్నట్టు సమాధానం ఇచ్చానని తెలిపారు. ప్రజల్లో మార్పు చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని అనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ స్కామ్‌ల ప్రభుత్వం పోయి బీఆర్ఎస్ స్కీముల ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరకుంటున్నారని అన్నారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, రాష్టాల్లో సర్ ప్రక్రియతో ఓట్లు గోల్ మాల్ కావడం వల్ల ఫలితాలు తారుమారు అయ్యాయని పేర్కొన్నారు. కాబట్టి సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశావహులు సర్ ను సీరియస్ గా తీసుకోవాలని.. బీఆల్వోలను పట్టించుకోవాలని చెప్పారు. లేదంటే మీకు ఇబ్బందని హెచ్చరించాడు.
పటాన్ చెరు గడ్డ... BRS అడ్డా:
పటాన్చెరు గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని హరీష్ రావు అన్నారు. ఇందుకు గత మున్సిపల్ ఎన్నికల ఫలితాల నిదర్శమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో యావత్తు తెలంగాణ పటాన్ చెరు వైపు చూసిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి రూ.30 వేల కోట్ల భూములను అమ్మాడని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కళ్యాణా లక్ష్మి చెక్కు పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత వస్తుందని ఎద్దేవా చేశారు.
అందాల పోటీలు, బోధి భవన్‌కి వందల కోట్లు ఖర్చు చేశావు. రాహుల్ గాంధీకి డబ్బులు పంపడానికి, పక్క రాష్ట్రాల్లో యాడ్లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి. మూసీ సుందరికరణ కోసం డబ్బులు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల కోసం మాత్రం డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు. మీకు కమీషన్ వచ్చే వాటికి డబ్బులు ఉంటాయి కానీ పేదలకు ఇచ్చే వాటికి డబ్బులు ఉండవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
