గజ్వేల్ మున్సిపాలిటీలో ‘చెత్త’ లొల్లి..! ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు.. 

గజ్వేల్ మున్సిపాలిటీలో ‘చెత్త’ లొల్లి..! ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు.. 
  • ప్రైవేటు సంస్థకు స్క్రాప్​ సేకరణ బాధ్యతలు
  • ఫీజుల వసూళ్లపై ప్రజల అభ్యంతరాలు
  • నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు కట్టబెట్టారని కౌన్సిలర్ల ఆరోపణ
  • ఇంటింటికీ రూ.300 నుంచి రూ.500 వరకు పిండుకుంటున్న కాంట్రాక్టర్లు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : గజ్వేల్ మున్సిపాలిటీలో చెత్త సేకరణ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ బాధ్యతలను నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో ప్రతినిత్యం ప్రత్యేక వాహనాల ద్వారా ఉచితంగా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. 

వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి మాత్రమే నామమాత్రపు ఫీజు వసూలు చేయాలని మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించినప్పటికీ, కొత్త కాలనీలు, విలీన గ్రామాల్లోని నివాస గృహాల నుంచి కూడా సదరు ప్రైవేటు సంస్థ నెలవారీగా రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తుండటంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు.. 

వ్యాపార సముదాయాల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను బట్టి కేటగిరీల వారీగా ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా, నివాస గృహాల యజమానుల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో ఈ ఇష్టారీతి ఫీజులపై నిరసన తెలిపిన పలు పార్టీల నాయకులు ఆ తర్వాత మౌనం వహించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో పబ్లిక్ నోటీసులు ఇచ్చి, నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించి కాంట్రాక్టు ఇస్తుండగా, గజ్వేల్‌లో మాత్రం కేవలం మౌఖిక ఆదేశాలు, మున్సిపల్ తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ఏకపక్షంగా తమకు అనుకూలమైన సంస్థకు కట్టబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి.

కౌన్సిలర్ల మధ్య విభేదాలు..  

ఈ ప్రైవేటు కాంట్రాక్టు వ్యవహారం గజ్వేల్ మున్సిపల్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. టెండర్లు పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు కౌన్సిలర్లు ఇటీవల మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. చట్టప్రకారమే కాంట్రాక్టు కేటాయించాలని వారు కోరుతున్నప్పటికీ మున్సిపల్ ముఖ్యులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. 

కొందరు ముఖ్యుల అండదండలతోనే ప్రైవేటు సంస్థ ఈ విధంగా వ్యవహరిస్తోందని కౌన్సిలర్లు, ప్రజలు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గంలో అంతర్గతంగా గ్రూపుల గొడవలు సాగుతుండగా, ఈ చెత్త సేకరణ అంశం వారి మధ్య నిప్పు రాజేసినట్లయింది. ఒకవైపు ఫీజుల మోతపై ప్రజల ఆగ్రహం, మరోవైపు నిబంధనల ఉల్లంఘనపై కౌన్సిలర్ల నిరసనలతో గజ్వేల్ బల్దియాలో చెత్త సేకరణ అంశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారులు స్పందించి వెంటనే ఈ ఏకపక్ష కాంట్రాక్టును రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఫీజుల వసూళ్లపై విచారణ చేపడుతున్నాం.. 

చెత్త సేకరణ విషయంపై ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. నివాస గృహాల నుంచి చెత్త సేకరణ కు ఫీజులు వసూలు చేయకుండా, వ్యాపార,  వాణిజ్య సంస్థల నుంచి ఫీజు వసూలు చేయాలని విషయాన్ని ఆలోచిస్తున్నాం. దీనిపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
గణేశ్​రెడ్డి, కమిషనర్, గజ్వేల్ మున్సిపాలిటీ