కల్లూరు: మెరుగైన వైద్యం అందించాలి

కల్లూరు: మెరుగైన వైద్యం అందించాలి

కల్లూరు, వెలుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడి కల్లూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌లో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ శనివారం పరామర్శించారు. కల్లూరులోని పుల్లయ్య బంజారా రోడ్డుకు చెందిన పలువురు మహిళలు శుక్రవారం చింతకాని మండలంలో జరిగిన సీఎం సభకు వెళ్తుండగా, కొణిజర్ల సమీపంలో వారి వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత కల్లూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌కు తరలించారు. 

ప్రస్తుతం వారికి అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్​తో పాటు వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. గాయపడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.