హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం.. ఫ్రంట్ పార్ట్ నుజ్జునుజ్జు..!

హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం.. ఫ్రంట్ పార్ట్ నుజ్జునుజ్జు..!

హైదరాబాద్: ఫిలింనగర్‌లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. సైట్-2, రోడ్ నంబర్.5లోని హిల్ వ్యూ అపార్ట్‌మెంట్ గేటును కారు ఢీ కొట్టింది. తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ఓవర్‌ స్పీడ్‌తో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ప్రమాదం జరిగిన కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదం అనంతరం కారులో ఉన్న యువకులు పరారయ్యారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేశారా? లేక నిర్లక్ష్యంగా, అతివేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫెరారీ కారును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా ఎవరి కారు, ఏంటనే విషయాలను ఆరా తీస్తున్నారు. వీకెండ్ కావడంతో పబ్కు వెళ్లి తాగేసి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తు్న్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయిన తీరు చూస్తుంటే కారు స్పీడ్ 120 దాటొచ్చని పోలీసులు భావిస్తున్నారు.