పరిహారం, పునరావాసం తేల్చాకేమూసీ పనులు చేపట్టాలి..డీపీఆర్, ఖర్చుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి: బండారు దత్తాత్రేయ

పరిహారం, పునరావాసం తేల్చాకేమూసీ పనులు చేపట్టాలి..డీపీఆర్, ఖర్చుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి: బండారు దత్తాత్రేయ
  • టీఆర్‌‌ఎల్‌డీ చీఫ్ దిలీప్​కుమార్ అధ్యక్షతన రౌండ్​టేబుల్​ సమావేశం

సైఫాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవ పనుల కన్నా ముందు నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. నది అభివృద్ధి అవసరమే అయినా.. నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం కల్పించాకే ముందుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. శనివారం లక్డీకాపూల్‌లో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్(టీఆర్ఎల్డీ) రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్​కుమార్ అధ్యక్షతన మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఇందులో బండారు దత్తాత్రేయ, పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్, ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. మూసీ పునరుద్ధరణ మంచి కార్యక్రమమని, కానీ ప్రజల భాగస్వామ్యం, నిపుణుల సూచనలతో ముందుకెళ్లాలని వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దత్తాత్రేయ మాట్లాడుతూ.. మూసీలోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా చేరకుండా ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసి విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలను తొలగించే సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలన్నారు. ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, మేధావులతో కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ముందు పరిహారంపై తేల్చండి..

మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇప్పటికీ పబ్లిక్ హియ రింగ్ నిర్వహించలేదని, నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఎలా నమ్మాలని హరగోపాల్ ప్రశ్నించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ బాధితులకు దూర ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయిస్తే ఉపాధి కోల్పోతారని, వారికి అక్కడే పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. రవీందర్ రావు మాట్లాడుతూ.. జీతాలు, పింఛన్లు సకాలంలో చెల్లించలేని ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తుందని ప్రశ్నించారు.

ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. చెరువులు, కట్టలు కనుమరుగవడంతో మూసీ మురికికూపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని ఎస్టీపీల ఏర్పాటు, పారిశ్రామిక వ్యర్థాల నియంత్రణపై దృష్టి పెట్టాలని తాడూరి శ్రీనివాస్ సూచించారు. నిర్వాసితులకు ఆశ్రయం, నష్టపరిహారం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు చేపట్టాలని బెల్లయ్య నాయక్ సూచించారు.

వక్తల అభిప్రాయాలను సీఎంకు నివేదిస్తామని ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి తెలిపారు. దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. పునరావాసం, సరైన నష్టపరిహారం, ప్రజా సంఘాల సందేహాల నివృత్తి అనంతరమే మూసీ ప్రాజెక్టు అమలు చేయాలని 
ప్రభుత్వాన్ని కోరారు.