జీవిత బీమా కంపెనీల ఖర్చుల.. లెక్క తేల్చాలని డిసైడ్ అయిన IRDAI !

జీవిత బీమా కంపెనీల ఖర్చుల.. లెక్క తేల్చాలని డిసైడ్ అయిన IRDAI !

జీవిత బీమా కంపెనీలు ఏజెంట్లకు చెల్లించే కమీషన్లను మాత్రమే కాకుండా, వాటి ఇతర  నిర్వహణ ఖర్చులను కూడా పరిశీలించేందుకు ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ)’ ముందుకొచ్చింది. 

బీమా పంపిణీ  వ్యవస్థలో  సంస్కరణలు  చేపట్టేముందు,  కమీషన్లను మినహాయించి సంస్థల నిర్వహణ వ్యయాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఐఆర్డీఏఐ తొలిసారిగా జీవిత బీమా సంస్థలను కోరింది. ఇప్పటి వరకు ఐఆర్డీఏఐ ప్రధానంగా ‘ఎక్స్‌‌పెన్సెస్ ఆఫ్  మేనేజ్‌‌మెంట్ (ఈఓఎం)’ అనే సమగ్ర ఖర్చు పరిమితిని మాత్రమే పర్యవేక్షించేది. ఇందులో ఏజెంట్ల కమీషన్లు,  కార్యాలయ నిర్వహణ, సాంకేతిక వ్యయాలు, ఉద్యోగుల జీత భత్యాలు తదితర అన్ని ఖర్చులు కలిపి ఉండేవి.

ఇప్పుడు వాటిని వేర్వేరుగా చూపించాలని కోరడం ద్వారా నియంత్రణ సంస్థ దృష్టి మరింత  విస్తరించినట్లు భావిస్తున్నారు. ఐఆర్డీఏఐ ఈ నెలాఖరులో బీమా పంపిణీ వ్యవస్థపై చర్చా పత్రాన్ని విడుదల చేయనుంది. ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం పాలసీదారుల ప్రయోజనాలను కాపాడటం,  బీమా  విక్రయాల్లో పారదర్శకత పెంచడం, అనవసర ఖర్చులను తగ్గించడం అని సమాచారం.

కమీషన్ రేట్లను నేరుగా నిర్ణయించే అవకాశాలు తక్కువగా  ఉన్నప్పటికీ,  పంపిణీ వ్యవస్థ,  పారితోషిక విధానం,  వినియోగదారుల ఫలితాలపై  విస్తృత  మార్గదర్శకాలు ఉండే అవకాశం ఉందని రంగ నిపుణులు చెబుతున్నారు.

బీమా రంగంలో గత ఏడాదిగా ప్రధాన చర్చ  కమీషన్  వ్యయాలపైనే సాగుతోంది. అయితే  కమీషన్లు తగ్గించినంత మాత్రాన పాలసీల ధరలు తగ్గవని ఐఆర్డీఏఐ భావిస్తోంది. సంస్థల ఇతర  నిర్వహణ  ఖర్చులు అధికంగానే కొనసాగితే  వినియోగదారుడికి ప్రయోజనం చేరదని  నియంత్రణ సంస్థ  అభిప్రాయం. రంగంలోని ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ ‘ఉత్పత్తులు నిజంగా చౌక కావాలంటే  కమీషన్లతోపాటు కార్యాలయ నిర్వహణ, సాంకేతిక మౌలిక వసతులు, ఉద్యోగ వ్యయాలు, పరిపాలనా ఖర్చులన్నింటినీ సమీక్షించాల్సిందే’ అని  పేర్కొన్నారు.

సంప్రదాయంగా బీమా సంస్థల సేకరణ, నిర్వహణ ఖర్చుల్లో సుమారు 55-60 శాతం వరకు కమీషన్లే ఉంటాయి.  మిగిలిన భాగం ఉద్యోగుల వ్యయం, టెక్నాలజీ పెట్టుబడులు, శాఖల నిర్వహణ,  అండర్‌‌ రైటింగ్, సర్వీసింగ్ వంటి అంశాలకు వెళ్తుంది. అందువల్ల మొత్తం వ్యయ నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలంటే కమీషన్లకు మించి చూడాల్సిన అవసరం ఉందని ఐఆర్డీఏఐ భావిస్తోంది.

ఆర్బీఐ నివేదిక కూడా కారణం
రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన 2026 ఆర్థిక స్థిరత్వ నివేదికలో ప్రభుత్వ, ప్రైవేట్ జీవిత బీమా సంస్థల ఖర్చు  నిర్మాణాల్లో పెరుగుతున్న వ్యత్యాసాలను ప్రస్తావించింది. ప్రైవేట్ జీవిత బీమా సంస్థల కమీషన్ వ్యయ నిష్పత్తి 2021-22లో సుమారు 4.5 శాతం ఉండగా  2025-26 నాటికి 9 శాతానికి  పైగా  పెరిగినట్లు నివేదిక పేర్కొంది.  అదేకాలంలో  ప్రభుత్వరంగ  సంస్థల్లో  పెరుగుదల  పరిమితంగానే ఉన్నట్లు తెలిపింది.

వినియోగదారుడికే లాభమా ?
ఐఆర్డీఏఐ  చేపడుతున్న ఈ విధానం బీమా రంగంలో  ఖర్చులపై  మరింత  పారదర్శకత  తీసుకురావచ్చని  నిపుణులు భావిస్తున్నారు. సంస్థలు వాస్తవ  నిర్వహణ  ఖర్చులను  వెల్లడించాల్సి రావడంవల్ల  అనవసర  వ్యయాలపై ఒత్తిడి పెరిగే  అవకాశం  ఉంది. దీర్ఘ కాలంలో ఇది పాలసీల ధరలు, సేవల నాణ్యత, వినియోగదారుల విశ్వాసంపై సానుకూల ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. 

బీమా విక్రయాల్లో తప్పుడు హామీలు, అధిక ముందస్తు కమీషన్లు, పాలసీ రద్దులు వంటి  సమస్యలను తగ్గించేందుకు కూడా ఐఆర్డీఏఐ  దశలవారీగా  సంస్కరణలు తీసుకురానున్నట్లు సమాచారం. కమీషన్ వ్యవస్థలో మార్పులతోపాటు మొత్తం వ్యయ నిర్మాణాన్ని సమీక్షించడం ద్వారా బీమా రంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చాలన్నదే నియంత్రణ సంస్థ లక్ష్యంగా కనిపిస్తోంది.

శ్రీశైలం దూడం

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.