గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో గత 11 రోజుల్లో వరుసగా నాలుగు హత్యలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పాత కక్షలు, రివేంజ్ మర్డర్లు, ప్రేమ వ్యవహారాల కారణంగా ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. కేటీ దొడ్డి మండలం మల్లాపురం గ్రామానికి చెందిన రాజునాయక్ (45)ను పాత కక్షలతో ఈ నెల 3న హత్య చేయగా, మూడు రోజుల కింద మల్దకల్ మండల పరిధిలోని ఉలిగేపల్లికి చెందిన బోయ మహేశ్ (24) లవ్ ఎఫైర్ కారణంతో హత్యకు గురయ్యాడు.
శుక్రవారం గద్వాల మండల పరిధిలోని శెట్టి ఆత్మకూరుకు చెందిన సంధ్య రాజు (45)ను ప్రత్యర్థులు నరికి చంపారు. గతంలో ఒక మహిళను తీసుకెళ్లి ఆమె భర్తను చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న సంధ్య రాజును రివేంజ్ మర్డర్‌లో భాగంగానే చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలు మరువక ముందే శనివారం గద్వాల టౌన్‌లోని బీసీ కాలనీలో శంకరమ్మ(65) ను పొడిచి చంపడం పట్టణ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
శంకరమ్మను బంధువే హత్య చేసిండు..
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో శనివారం మధ్యాహ్నం శంకరమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన సమీప బంధువు కత్తితో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యాడు. పాత గొడవలతో పాటు ఆస్తి వివాదాలు కూడా ఉండటంతోనే తమ బంధువైన మేకల రామంజి తమ తల్లిని హత్య చేశాడని మృతురాలి కుమార్తెలు ఆరోపించారు.
మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు అనంతరం నేరుగా టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని గద్వాల టౌన్ ఎస్సై కల్యాణ్ కుమార్ పరిశీలించారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూతురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
