నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు గంధం గోపాల్ మృతి.. 9ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు

నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు గంధం గోపాల్ మృతి.. 9ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు
  • అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూత
  • టీఆర్‌‌‌‌ఎస్ చీఫ్ కవిత సంతాపం 

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  తొమ్మిదేండ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరెళ్ల పోలీసుల థర్డ్‌‌‌‌ డిగ్రీ ఘటనలో బాధితుడైన గంధం గోపాల్ శనివారం అనారోగ్యంతో మృతిచెందాడు. నేరెళ్లలో ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు 8 మందిపై పోలీసులు థర్డ్‌‌‌‌ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. 

పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడినప్పటి నుంచి గంధం గోపాల్‌‌‌‌ ఆరోగ్యం సరిగా లేదు. కుడికాలుకు తీవ్ర గాయాలు కావడంతో సరిగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అతడు శనివారం కన్నుమూశాడు. గంధం గోపాల్‌‌‌‌కు భార్య లావణ్య, కుమార్తెలు అక్షిత(22), నిఖిత(18), కొడుకు అభినయ్(16) ఉన్నారు. మరో బాధితుడు పెంట బాణయ్య ఇప్పటికీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. 

నేరెళ్లలో అసలేం జరిగింది?

2017లో మిడ్‌‌‌‌మానేరు జలాశయ ముంపు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల కోసం నాటి బీఆర్ఎస్​సర్కార్​అనుమతులు ఇవ్వడంతో రోజూ వందలాది లారీలు ఇసుక రవాణా చేసేవి. కొంతమంది డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడంతో తరచూ ప్రమాదాలు జరిగేవి. 2017 జులై 2న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్ల గ్రామానికి చెందిన రైతు బదనపు భూమయ్య మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు నేరెళ్ల వద్ద ఇసుక లారీలను తగులబెట్టారు. 

ఈ ఘటనలో పోలీసులు పలువురిపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని 2017 జులై 8న రిమాండ్‌‌‌‌కు తరలించగా, వారి శరీరాలపై తీవ్ర గాయాలు ఉండటంతో అప్పటి కరీంనగర్ జైలర్ శివకుమార్ మొదట రిమాండ్‌‌‌‌కు నిరాకరించారు.
 
దీంతో పోలీసులు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి, ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి జైలుకు తరలించారు. జైలు లోపలికి వెళ్లాక నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో పోలీసుల థర్డ్‌‌‌‌ డిగ్రీ ఆరోపణలు వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను కుదిపేసిన ఘటన..

అప్పటి బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. వివిధ పార్టీల నేతలు, హక్కుల సంఘాల నేతలు బాధితులను పరామర్శించి పోలీసుల తీరును ఖండించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ఆ ఘటన జరగడం ఆ పార్టీకి మరింత మైనస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అప్పుడు ప్రతిపక్ష నేతలుగా బాధితులను పరామర్శించారు. కాగా, గంధం గోపాల్ మృతిపై టీఆర్‌‌‌‌ఎస్ చీఫ్ కవిత సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. గోపాల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్వరలో ఆయన కుటుంబ సభ్యులను కలిసి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు.