- భక్తులకు రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా విజ్ఞప్తి
- ఆలయ నిర్వహణ వ్యవస్థను మెరుగుపరుస్తామని వెల్లడి
అయోధ్య: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయంలో విరాళాల దొంగతనంపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విరాళాల దొంగతనం సిగ్గుచేటని.. ఆలయ ప్రతిష్టకు జరిగిన మాయని మచ్చని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనతో తామంతా తీవ్ర మానసిక క్షోభకు గురయ్యామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విరాళాలు దుర్వినియోగం కావడంపై భక్తులందరికీ తాము క్షమాపణలు చెబుతున్నామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఆలయ నిర్వహణ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరుస్తామని నృపేంద్ర మిశ్రా స్పష్టం చేశారు.
చివరి దశ ఆలయ నిర్మాణ పనులు
ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై కూడా నృపేంద్ర మిశ్రా స్పష్టత ఇచ్చారు. స్మారక చిహ్నంగా మారుస్తున్న పాత ఆలయ పనులు దాదాపు చివరి దశకు వచ్చాయని.. అక్కడ 24 గంటలూ వెలిగే అఖండ జ్యోతి ఏర్పాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు.ఈ జూలై 30 నాటికి ప్రధాన ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఆలయం బయట నిర్మిస్తున్న 4 కిలోమీటర్ల రక్షణ గోడ, ఆడిటోరియం వంటి మిగిలిన పనులు నవంబర్ లేదా డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. అలాగే, 20 గ్యాలరీలతో ఏర్పాటు చేస్తున్న 'రామ్‌కథా మ్యూజియం' పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎంతోమంది త్యాగాలు, సుదీర్ఘ ఉద్యమం వల్ల సాకారమైన అయోధ్య రామాలయం ప్రపంచంలోనే అద్వితీయమైనదని, సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారని నృపేంద్ర మిశ్రా పేర్కొన్నారు.
రాజీనామాలకు ఆమోదం
విరాళాల దొంగతనం వివాదం తీవ్రం కావడంతో ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామా చేయగా వాటిని ట్రస్ట్ ఆమోదించింది. ప్రస్తుతం కృష్ణ మోహన్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్నారు. ఆలయ నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చడానికి ఒక సీఈఓని నియమించాలని కమిటీ నిర్ణయించింది. ఈ నియామకం కోసం ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ట్రస్ట్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆలయ భద్రత, ఆర్థిక విషయాల పర్యవేక్షణను ఎలా మెరుగుపరచాలనే అంశంపై చర్చించేందుకు జూలై 22న ట్రస్ట్ మరోసారి ప్రత్యేకంగా సమావేశం కానుంది.
