ఇండియా మ్యాప్ను తప్పుగా ప్రదర్శించిన బంగ్లాదేశ్ : భారత దౌత్యవేత్త పూజా కుమారి ఝా

ఇండియా మ్యాప్ను తప్పుగా ప్రదర్శించిన బంగ్లాదేశ్ : భారత దౌత్యవేత్త పూజా కుమారి ఝా
  •  తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసిన భారత దౌత్యవేత్త పూజా కుమారి 

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌‌లో జరిగిన ఓ సెమినార్ లో ఇండియా మ్యాప్ ను తప్పుగా ప్రచురించి ప్రదర్శించారు. దీనిపై భారత దౌత్యవేత్త పూజా కుమారి ఝా తీవ్ర అభ్యంతరం తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ హైకమిషనర్ అహ్మద్ తారిఖ్ కరీం ప్రసంగం సందర్భంగా ఈ అభ్యంతరాన్ని లేవనెత్తారు. భారత్​లో జమ్మూ కాశ్మీర్  అంతర్భాగమని ఆమె మరోసారి నొక్కి చెప్పారు. బంగ్లా రాజధాని ఢాకాలో ఇటీవల బంగ్లాదేశ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ లో ‘ సార్క్‌‌ పునరుజ్జీవింవ మార్గాలు’ అనే అంశంపై సెమినార్‌‌ నిర్వహించారు. 

ఈ సెమినార్​లో 2009 నుంచి 2014 వరకు భారతదేశంలో బంగ్లాదేశ్ హైకమిషనర్‌‌గా పనిచేసిన కరీం మాట్లాడుతుండగా.. ఆడియన్స్​లో ఉన్న పూజా కుమారి ఝా ఆయన ప్రదర్శించిన మ్యాప్ తప్పుగా ఉందని ఎత్తి చూపారు. ‘మీరు చూపించిన భారతదేశం మ్యాప్​ తప్పు. జమ్మూ కాశ్మీర్.. భారతదేశంలో అంతర్భాగం’ అని ఆమె అన్నారు. అయితే, ఆ మ్యాప్​కేవలం ప్రాతినిధ్య ప్రయోజనాల కోసం మాత్రమేనని, వాస్తవ సరిహద్దులను చూపించదని కరీం అన్నారు.