హనుమకొండ: విష జ్వరాల కట్టడి!..డోర్ టు డోర్ ఫీవర్ సర్వే మొదలు పెట్టిన ఆఫీసర్లు

హనుమకొండ: విష జ్వరాల కట్టడి!..డోర్ టు డోర్ ఫీవర్ సర్వే మొదలు పెట్టిన ఆఫీసర్లు
  • హనుమకొండ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
  •     ఇప్పటివరకు 17 మందికి డెంగీ లక్షణాలు
  •     జ్వరం ఉంటే మెడిసిన్ అందజేత
  •     హై రిస్క్ ఏరియాలను గుర్తించి జ్వరాలు వ్యాప్తిచెందకుండా యాక్షన్

హనుమకొండ, వెలుగు: అడపాదడపా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధుల కాలం మొదలైంది. ఓ వైపు దోమల బెడద, మరోవైపు శానిటేషన్​సమస్యలతో విషజ్వరాల ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా ఆఫీసర్లు ముందస్తుగా అలర్ట్​ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డెంగీ, మలేరియా, చికున్​ గున్యాలాంటి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా డోర్ టు డోర్ ఫీవర్ సర్వేను ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌‌‌‌ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. హైరిస్క్ ఏరియాలను గుర్తించి, అక్కడ విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

డోర్ టు డోర్ ఫీవర్ సర్వే షురూ..

ఏటా వర్షాకాలంలో జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. దోమల బెడదతో విషజ్వరాలు అధికమవుతుండటంతో కేసుల సంఖ్య కూడా ఏటేటా పెరుగుతోంది. 2024లో జిల్లాలో 180 డెంగీ కేసులు నమోదవగా, 2025లో 191 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ అడపాదడపా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యాధికారులు భావిస్తున్నారు. దీంతో జిల్లా వైద్యారోగ్యశాఖ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. జులై 1 నుంచి జిల్లా వ్యాప్తంగా డోర్ టు డోర్ ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌‌ఎంలకు సర్వే బాధ్యతలు అప్పగించగా, వారి పనితీరును మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజూ సర్వే వివరాలను జిల్లా అధికారులకు నివేదించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలో హనుమకొండ జిల్లాలో 17 డెంగీ కేసులను గుర్తించారు. అలాగే జ్వరంతో బాధపడుతున్న వారికి అవసరమైన మెడికల్ కిట్లు పంపిణీ చేయాలని ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు.

హైరిస్క్ ఏరియాలపై ఫోకస్

ఫీవర్ సర్వేలో భాగంగా గతేడాది డెంగీ, చికున్‌‌గున్యా ఎక్కువగా నమోదైన ప్రాంతాలను హైరిస్క్ ఏరియాలుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. నిరుడు హనుమకొండ జిల్లాలోని కమలాపూర్, వేలేరు మండలం చింతలతండా, నడికూడ మండలం రాయపర్తి, గ్రేటర్ వరంగల్ పరిధిలోని న్యూ శాయంపేట, కుమార్‌‌పల్లి తదితర 18 ప్రాంతాల్లో విషజ్వరాలు ఎక్కువగా నమోదయ్యాయి. 

అక్కడ ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా నిర్వహించారు. ఈ ఏడాది కూడా గ్రామీణ ప్రాంతాలతో పాటు గ్రేటర్ పరిధిలోని స్లమ్ ఏరియాలపై స్పెషల్​ ఫోకస్​పెట్టారు. భారీ వర్షాల కారణంగా జ్వరాల తీవ్రత పెరిగితే అవసరమైన చోట వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసేలా ఆఫీసర్లు ప్లాన్​ చేస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాలు కురిసే ఛాన్స్​ ఉండగా, అప్పటివరకు సర్వే కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ కార్యక్రమాలు నిర్వహిస్తూ దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతి నెల రెండుసార్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు యాక్షన్​ప్లాన్​ అమలు చేస్తున్నారు.

సెప్టెంబర్ వరకు సర్వే..

సీజనల్ వ్యాధులను కట్టడి చేసే ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే ప్రారంభించాం. డోర్ టు డోర్ సర్వేలో భాగంగా జ్వర బాధితులను గుర్తించి, వారికి మెడిసిన్ అందజేస్తున్నాం. ఈ సర్వేను సెప్టెంబర్ చివరి వరకూ కొనసాగిస్తాం. సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు క్షేత్రస్థాయిలో సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహిస్తాం. విష జ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు చేపడతాం.
- డా.ఏ.అప్పయ్య, డీఎంహెచ్​వో, హనుమకొండ