హైదరాబాద్ లో ఎండిపోయిన బోర్లకు ‘రీచార్జ్’...నీటి కష్టాలకు చెక్ పెట్టడమే లక్ష్యం

హైదరాబాద్ లో ఎండిపోయిన బోర్లకు  ‘రీచార్జ్’...నీటి కష్టాలకు చెక్ పెట్టడమే లక్ష్యం

హైదరాబాద్, వెలుగు:  నగరంలో భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోర్​వెల్స్​ ఎండిపోయాయి.  తిరిగి వాటికి ప్రాణం పోసేందుకు మెట్రో వాటర్ బోర్డు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంజక్షన్ బోర్ వెల్స్’ సాంకేతికత ద్వారా వర్షపు నీటిని భూమిలోకి పంపి, ఎండిపోయిన బోరు బావులను రీఛార్జ్ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా వెస్ట్ సిటీలో ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది.

వర్షపు నీటిని ఒడిసి పడితేనే భద్రత

గుట్టల బేగంపేటలోని బీవర్లీ హిల్స్ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఇంజెక్షన్ బోర్ వెల్ వ్యవస్థను మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో నీటి భద్రత కేవలం ప్రభుత్వ చర్యలతోనే సాధ్యం కాదన్నారు. ఇందులో  ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఇల్లు, కుటుంబం, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీ వర్షపు నీటి సంరక్షణను తమ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం నామమాత్రంగా ఇంకుడు గుంతలు నిర్మించకుండా.. భవనంపై పడే ప్రతీ వర్షపు చుక్కను భూమిలోకి ఇంకేలా శాస్త్రీయమైన రూఫ్‌‌‌‌‌‌‌‌టాప్ రెయిన్‌‌‌‌‌‌‌‌ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులను పాటించాలని సూచించారు. ఇంకుడు గుంతను, పాడైపోయిన బోరుబావిని వినియోగించి ఏర్పాటు చేసిన రీచార్జ్ పిట్‌‌‌‌‌‌‌‌(ఇంజక్షన్ బోర్ వెల్)తో తిరిగి నీటిని పొందవచ్చని తెలిపారు.  

పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్

నగరంలో నీటి కొరత తీవ్రతను అంచనా వేసేందుకు వాటర్ బోర్డు ట్యాంకర్ బుకింగ్ డేటాను విశ్లేషిస్తోంది. గతేడాది 4 వేల అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు ట్యాంకర్ల కోసం బుక్ చేసుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 12,500కు పెరిగింది. గతంలో జూబ్లీహిల్స్, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి వంటి ప్రాంతాలకే పరిమితమైన డిమాండ్, ఇప్పుడు ఉప్పల్, ఎల్‌‌‌‌‌‌‌‌బీ నగర్, మల్కాజ్​గిరి వంటి ప్రాంతాలకు కూడా విస్తరించినట్లు ఎండీ తెలిపారు. వర్షాలు ఆలస్యం కావడం, భూగర్భ జలాలు అడుగంటడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. బీవర్లీ హిల్స్ లోని అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ వాసులు చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. వాటర్ బోర్డు సైబరాబాద్ రీజినల్ ఈడీ సంతోష్, డైరెక్టర్(ఆపరేషన్స్) నారాయణ, జీఎం హరిశంకర్, ఇంకుడుగుంతల ప్రత్యేక అధికారి జాల సత్యనారాయణ, బీవర్లీ హిల్స్ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.