- రోజూ 2 టీఎంసీల చొప్పున వంద రోజుల్లో 200 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు
- గోదావరిలో పైన ఎక్కడా నీళ్లు లేవు.. కన్నెపల్లి దగ్గర్నే ఉన్నయ్
- అది మేడిగడ్డ కాదు.. మేటిగడ్డ.. 28 లక్షల క్యూసెక్కుల వరదనూ తట్టుకుందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డలో నీళ్లు నిల్వచేయకుండానే.. ఆ బ్యారేజీని ముట్టుకోకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయొచ్చని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పేర్కొన్నారు. కన్నెపల్లి వద్ద 93 మీటర్ల ఎత్తులో నీళ్లుంటే నీటిని లిఫ్ట్ చేయొచ్చని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారని, కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని అన్నారు. ఇంకో వంద రోజుల పాటు వరద ఉంటుందని, కాబట్టి రోజూ 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చని తెలిపారు. శనివారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
అన్నారం, సుందిళ్లలో ఏర్పడిన బుంగలకు గ్రౌటింగ్ చేశారని అధికారులే చెప్తున్నారని, అన్నారం 5.1, సుందిళ్లలో 3.7 టీఎంసీలు నింపొచ్చని అంటున్నారని పేర్కొన్నారు. అక్కడ నీళ్లతో ఎల్లంపల్లికి నీటిని తీసుకెళ్లొచ్చన్నారు. పైన గోదావరిలో నీళ్లు లేకున్నా.. ప్రాణహిత నుంచి వరద వస్తున్నదని తెలిపారు. నీటిని లిఫ్ట్ చేయకపోవడం వల్ల రోజూ 9 టీఎంసీలు వృథాగా కిందకు పోతున్నాయన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ కక్షతో తెచ్చిన కరువు అని మండిపడ్డారు.
దేవాదులలో ఫుల్ కెపాసిటీతో మోటార్లను నడిపే అవకాశం ఉన్నా.. రెండు పంపులే నడుపుతున్నారని చెప్పారు. రైతులు మొగులుదిక్కు.. కన్నెపల్లి దిక్కు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పంపులు ఆన్చేయకుంటే రేవంత్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. బ్యారేజీల్లో నీళ్లు నింపాలని ఎవరు అడిగారని, ఎత్తిపోయాలని చెబుతున్నామని మంత్రి ఉత్తమ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం విలువ తెలుస్తది..
కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్తున్న రేవంత్‌రెడ్డి.. తాను చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి నీళ్లు తెస్తామంటున్న మల్లన్నసాగర్ ఎక్కడిదని ప్రశ్నించారు. ‘‘మేడిగడ్డ గేట్లు దించితే భద్రాచలం రాముడికి ప్రమాదం అని సీఎం రేవంత్ అంటున్నడు. 2022 లో 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే 3 బ్యారేజీలకు ఏం కాలేదు. రోజూ 240 టీఎంసీల వరద 15 రోజుల పాటు వచ్చినా భద్రాచలానికి ఏం కాలేదు.. ఇప్పుడు లక్ష క్యూసెక్కులకే కొట్టుకుపోతదా? అది మేడిగడ్డ కాదు.. మేటిగడ్డ. పైన ఎక్కడా నీళ్లు లేవు.. ఒక్కటే చోట ఉన్నయ్.. కేవలం కన్నెపల్లి దగ్గరే ఉన్నయ్.
ఇక్కడ నీళ్లు లేవని రేవంత్ చెప్తున్నాడు.. కానీ కింద పట్టిసీమ నుంచి ఏపీ నీళ్లు ఎత్తిపోస్తున్నది. ఏదైనా ఉంటే మమ్మల్ని తిట్టు.. కానీ రైతులపై కక్ష గట్టకు. భద్రాచలానికి మేడిగడ్డతో ముప్పు లేదు.. పోలవరం ఎత్తుతోనే ఉంది. అందుకే తెలంగాణ మండలాలను ఏపీలో కలిపారు కదా. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం సొంత ప్రాజెక్టులతోనే సొంత ప్రాంతాలకు ముప్పు అని మాట్లాడుతుండు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి.. దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకోవద్దు. ఎన్నికలప్పుడు నువ్వు అందరూ దేవుళ్ల మీద ఒట్టేసినవ్.. ఇప్పుడు ఆ దేవుళ్లే తలలుపట్టుకునే పరిస్థితి తెచ్చినవ్. ఇప్పుడు మళ్లీ రాములవారిపై ఆన అంటుండు.. జాగ్రత్త రేవంత్’’ అని పేర్కొన్నారు.
పైసలు ఎత్తిపోస్తడు.. నీళ్లు ఎత్తడు
రేవంత్‌రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి పైసలు ఎత్తిపోయడం తెలుసుగానీ.. రైతుల కోసం నీటిని ఎత్తిపోయడం తెలియదని అన్నారు. ఇక్కడ నోట్ల మూటలను ఢిల్లీకి పంపడం మాత్రమే తెలుసన్నారు. ‘‘దొంగ ఓట్లతోని గెలిచిన నీకు.. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన నీకే అంతుంటే.. ఉద్యమకారుడైన కేసీఆర్‌కు ఎంతుంటుంది? మమ్మల్ని మొలవనివ్వమని చెప్తున్నావ్ కదా.. రా మరి ఎన్నికలకుపోదాం.
అసెంబ్లీ రద్దు చెయ్యి మరి.. అక్కడిదాకా వద్దు మా దగ్గరి నుంచి తీసుకున్న 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు పోదాం. కాంగ్రెస్ కు 117 కాదు.. 7 సీట్లు కూడా రావు. మాకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 78 సీట్లు వస్తాయని సర్వేలు చెప్తున్నాయి.. ఎంతసేపూ అదానీని మించి పోవాలనే తాపత్రయమే.
ఎప్పటికీ అనుముల అన్నాదమ్ముల గురించే కాదు.. కాస్త అన్నారం గురించి కూడా పట్టించుకో. హరీశ్‌రావు.. కేసీఆర్ తయారు చేసిన సైనికుడు.. శీల పరీక్ష పెడితే రేవంత్‌కు పెట్టాలి. ఎందుకంటే ఢిల్లీకి పోయి పొద్దున కాంగ్రెస్.. రాత్రి బీజేపీ వాళ్లతో రేవంత్ కలుస్తాడు’’ అని వ్యాఖ్యానించారు.
