సమర్థులైన యువతకే కాంగ్రెస్‌ లో పెద్దపీట

సమర్థులైన యువతకే కాంగ్రెస్‌ లో పెద్దపీట
  • కాంగ్రెస్ ట్యాలెంట్ హంట్‌ను పరిశీలించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
  • జీఎస్ రావు, గాయని జానకి మృతి పట్ల సంతాపం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన యువతను అధికార ప్రతినిధులుగా నియమించేందుకు పీసీసీ శనివారం ‘ట్యాలెంట్ హంట్’ ఇంటర్వ్యూలను ప్రారంభించింది. ఇందిరా భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా హాజరై ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రతిభావంతులైన, ముఖ్యంగా తటస్థ యువతకు ఇందులో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇంటర్వ్యూలకు వచ్చిన అభ్యర్థుల విద్యా అర్హతలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పీసీసీ చీఫ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమాజ సేవ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో ప్రజల కోసం పనిచేసే యువతకే కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేస్తామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడిగా, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేగా సేవలందించిన సీనియర్ నేత జీఎస్ రావు మృతి పట్ల మహేశ్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బషీర్‌బాగ్‌లోని ఆయన నివాసానికి వెళ్లి, జీఎస్ రావు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అలాగే,దక్షిణ భారత స్వరకోకిల, ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం పట్ల కూడా  తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. గత ఆరు దశాబ్దాలుగా తన అద్భుతమైన మధుర గానంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన జానకమ్మ మృతి తీరని లోటని పేర్కొన్నారు.