గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి/ ఖమ్మం రూరల్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన ప్రతి నిరుపేదకు పారదర్శకంగా అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం కలెక్టర్ దివాకర్ తో కలిసి ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించిన మంత్రి సుమారు రూ.4.38 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆరేకోడు తండా–కాచిరాజుగూడెం బీటీ రోడ్డు, రమణతండా లింక్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే ఆరేకోడు తండాలో మినరల్ వాటర్ ప్లాంట్‌‌ను ప్రారంభించి, 20 మంది పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. 

తిరుమలాయపాలెంలో 19 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 77 మందికి రూ.24.67 లక్షల విలువైన సీఎంఆర్‌‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 129 మంది లబ్ధిదారులకు రూ.35.91 లక్షల సీఎంఆర్‌‌ఎఫ్ చెక్కులు, మూడు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కొక్కిరేణిలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి, అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.