భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రైతు భరోసా డబ్బులను ఇతర బకాయిలు, సేవా చార్జీలు, డెబిట్ చేయడం, సర్దుబాటు చేయడం వంటి చర్యలకు పాల్పడే బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 1,78,828 మంది రైతుల బ్యాంకుల ఖాతాల్లో రూ.318.42 కోట్లను జమ చేసినట్లు చెప్పారు.
భరోసా నిధులను రైతులకు పూర్తిస్థాయిలో అందించే విధంగా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అక్కినేపల్లిలో 8,990 ఎకరాలకు 4,900 ఎకరాల్లో భూ సర్వే పూర్తైందన్నారు. గుండాల మండలంలో సర్వే పనులు కొనసాగుతున్నాయన్నారు. పెద్ద వెంకటాపురంలో 537 ఎకరాలు, శుభంపేటలో 267 ఎకరాల భూ సర్వే పూర్తయ్యిందన్నారు. మాధారంలో సోమవారం నుంచి రీ సర్వే చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకం పరిధిలో ఈ నెలలో 5వేల ఎకరాలకు భూ సర్వే చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలోని 17 గ్రామాల్లో రీ సర్వే చేపట్టనున్నట్టు తెలిపారు. జిల్లాలో 206 మంది సర్వేయర్లున్నారు. 56 మంది జిల్లాకు కేటాయించగా, ఇందులో 16 మంది ఇప్పటికే విధుల్లో చేరారని పేర్కొన్నారు. తొలి దశలో 14 గ్రామాలను ఎంపిక చేసి పాల్వంచ, గుండాల, పినపాక, దుమ్ముగూడెం, బూర్గంపహడ్ మండలాల్లోని 4వేల ఎకరాల్లో సర్వే పూర్తి చేసే లక్ష్యంగా పనులు చేపడ్తున్నామన్నారు.
