- ఎంపీ చామలతోపాటు ముఖ్య నేతల అభిప్రాయాల సేకరణ
- అసలైన కార్యకర్తలకు పదవులివ్వాలంటూ గాంధీ భవన్ వద్ద నిరసన
హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించేందుకు.. పీసీసీ నియమించిన పరిశీలకుడు జగ్గారెడ్డి శనివారం గాంధీ భవన్‌లో జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అసలు కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకే మండల పార్టీ అధ్యక్ష పదవులు ఇచ్చారంటూ పలువురు పార్టీ నాయకులు వారం క్రితం గాంధీ భవన్‌కు వచ్చి ధర్నా నిర్వహించారు.
ఇదే అంశంపై సామేల్‌తో స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య వివాదం నెలకొంది. ఇది చినికి చినికి గాలివానలా మారి పంచాయితీ చివరకు పీసీసీ వరకు వెళ్లింది. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను జగ్గారెడ్డికి పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అప్పగించారు. జగ్గారెడ్డి శనివారం గాంధీ భవన్‌లో సూర్యాపేట జిల్లా ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.
వీరిలో ఎంపీ చామలతోపాటు డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, నియోజకవర్గ నేత సర్వోత్తమ్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ మండలాధ్యక్ష పదవులు దక్కలేదని, ఎమ్మెల్యే సామేల్ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇప్పించుకున్నారని జగ్గారెడ్డికి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తల నిరసన..
జగ్గారెడ్డి ఓ వైపు నేతలతో వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్న సమయంలోనే ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు గాంధీ భవన్ ఎదుట నిరసనకు దిగారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ను కాపాడాలని, ఎమ్మెల్యే సామేల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జగ్గారెడ్డి బయటకు వచ్చి కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిరసనను విరమించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీకి ఇటు ఎమ్మెల్యే సామేల్ అటు ఎంపీ చామల.. ఇద్దరూ ముఖ్యమేనని, ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే మందుల సామేల్ గాంధీ భవన్‌కు వచ్చి జగ్గారెడ్డికి వివరణ ఇవ్వనున్నారు. దీంతో సోమవారం ఈ వివాదంపై పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ కు జగ్గారెడ్డి నివేదిక ఇవ్వనున్నారు.
