జేఎన్టీయూలో ప్రపంచస్థాయి సాంకేతిక విద్య: మంత్రి దామోదర రాజనర్సింహ

జేఎన్టీయూలో ప్రపంచస్థాయి సాంకేతిక విద్య: మంత్రి దామోదర రాజనర్సింహ

పుల్కల్​, వెలుగు : - జేఎన్​టీయూలో ప్రపంచస్థాయి సాంకేతిక విద్య అంందుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం -చౌటకూర్​ మండల పరిధిలోని సుల్తాన్​పూర్​లో ఉన్న  జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ ఇంజినీరింగ్,  ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కళాశాల బస్సులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వీఎల్‌ఎస్‌ఐ సిస్టమ్ డిజైన్ అండ్ సిమ్యులేషన్ ల్యాబొరేటరీ, స్మార్ట్ కంప్యూటింగ్ ల్యాబొరేటరీ, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ ఫార్మసీ ల్యాబొరేటరీలను మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సుల్తాన్‌పూర్ క్యాంపస్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, ఆధునిక ప్రయోగశాలలు విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంపై ప్రాయోగిక అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మరింత పెంచుతాయని తెలిపారు. 

తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ వారు ముందుకు వచ్చి  కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్​) నిధుల ద్వారా  కళాశాలలకు రెండు బస్సులను అందించడం అభినందనీయమన్నారు. కొత్తగా ప్రారంభించిన ప్రయోగశాలల్లో సెమీకండక్టర్ టెక్నాలజీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక రంగాల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. 

అనంతరం సుల్తాన్‌పూర్ క్యాంపస్‌లో ప్రతిపాదిత క్లాక్ టవర్ నిర్మాణ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. నిర్మాణ రూపకల్పన, వ్యయ అంచనాలను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ కళాశాల ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, అందోల్ క్యాంపస్ నిర్మాణానికి రూ.57 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.  భవనాల నిర్మాణానికి సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్‌ను వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి,  జేఎన్‌టీయూహెచ్  డైరెక్టర్ డాక్టర్​ఎ. దామోదరం, చీఫ్ ఇంజినీర్ డాక్టర్​ఎస్. శ్రీనివాసులు, జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ కళాశాల ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ డా. సునీత రెడ్డి, యూనివర్సిటీ కళాశాల ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డా. ఎస్. విశ్వనాథ రాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్​ వై. రాఘవేందర్ రావు, విభాగాధిపతులు, లెక్చరర్లు, విద్యార్థులు, తోషిబా సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.