న్యూఢిల్లీ: కేవలం 15 రోజుల్లో బ్యాంకుల్లోకి రూ.6.97 లక్షల కోట్లు డిపాజిట్ల రూపంలో వచ్చాయని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. దీని ప్రకారం గతనెల 30తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్ల విలువ దాదాపు రూ.ఏడు లక్షల కోట్లు పెరిగింది.
ఇది 29 ఏళ్లలో మూడో అత్యధిక వృద్ధి కావడం విశేషం. మొత్తం డిపాజిట్లలో త్రైమాసిక ముగింపు డిపాజిట్ల వాటా రూ.3.5 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల వరకు ఉంది. మిగిలినవి ఎఫ్‌సీఎన్‌ఆర్ బి, విదేశీ అప్పులు, ఓఎఫ్‌సీబీ మార్గాల్లో వచ్చాయి.
ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి , రూపాయిని బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల వల్ల ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. డెట్ ఎఫ్‌ఏఆర్ ఇన్ ఫ్లోస్ విలువ 2.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
గత ఏడాది రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంక్ క్రెడిట్ ఈ ఏడాది రూ.5.6 లక్షల కోట్లకు పెరిగింది. ఈ భారీ డిపాజిట్ల వల్ల బ్యాంకుల్లో లిక్విడిటీ మరింత మెరుగయ్యే అవకాశం ఉంది.
