- మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి
- హుజూర్‌నగర్, కోదాడలో కొత్త బస్టాండ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన
హుజూర్‌నగర్/కోదాడ, వెలుగు: రాష్ట్రంలోని రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సును నడపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హుజూర్ నగర్ లో రూ. 3.52 కోట్లతో, కోదాడలో రూ.17 కోట్లతో నిర్మించే బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీలో 3,500 మందికి కొత్త ఉద్యోగాలు కల్పించామని, వెయ్యి కారుణ్య నియామకాలు చేపట్టామని, 250 మంది డిస్మిస్ కార్మికులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నట్టు తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న కాలంలో పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయినా పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం సమ్మె నోటీస్ ఇస్తేనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు 327 కోట్ల ఫ్రీ బస్సు టికెట్లు జారీ అయ్యాయని, వీటి విలువ రూ.11,400 కోట్లు ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, కుంగిపోయి, కూలిపోయిన ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు తగదని హితవు పలికారు.
హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్, రూ.50 కోట్లతో జవాహర్ నవోదయ స్కూల్, రూ.21 కోట్లతో వంద పడకల హాస్పిటల్, రూ.26 కోట్లతో సిటీ స్కాన్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించినట్లు తెలిపారు.
హుజూర్ నగర్ నుంచి కోదాడ వరకు మంత్రులు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ దొంతగాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్పర్సన్ రాధిక పాల్గొన్నారు.
