సారూ.. పోడు భూములు సాగు చేయనిస్తలే...పంటలు వేయకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు..!

సారూ..  పోడు భూములు సాగు చేయనిస్తలే...పంటలు వేయకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు..!
  • కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కెరమెరి మండలం సూర్దపూర్ లో ..
  • మంత్రి జూపల్లి కృష్ణారావుకు  మహిళా రైతు మొర
  • దశాబ్దాలుగా సాగు చేస్తున్న తమను ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని ఆవేదన

ఆసిఫాబాద్, వెలుగు: దశాబ్దాలుగా సాగు చేస్తున్న పోడు భూముల్లో పంటలు వేయకుండా ఫారెస్ట్  ఆఫీసర్లు అడ్డుకొని, కందకాలు తవ్వుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుట మహిళా రైతు కన్నీళ్లు పెట్టుకుంది. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లాలోని ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి మండలాల్లో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా కెరమెరి మండలం ధనోర గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సూర్దపూర్  గ్రామానికి చెందిన మహిళా రైతు గుజ్జుల లక్ష్మి మంత్రి ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది.

 పోడు భూములే తమకు జీవనాధారమని, భూములు లాక్కుంటే ఎట్ల బతకాలని వాపోయింది. ఈ ఖరీఫ్  సీజన్​లో సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని వేడుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు, గిరిజనేతరులు ఇళ్లు నిర్మించుకోవడం, వ్యవసాయం చేసుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్వోఎఫ్ఆర్  చట్టం ప్రకారం 2005కు ముందు నుంచి అటవీ భూములను సాగు చేసుకుంటున్న వారికి మాత్రమే పట్టా పొందే హక్కు ఉంటుందని చెప్పారు. 

గిరిజనేతరులకు ఈ చట్టం వర్తించకపోయినా, 30 నుంచి -40 ఏండ్లుగా ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న పేదలను ఇబ్బంది పెట్టవద్దని అటవీ అధికారులకు సూచించినట్లు తెలిపారు. కొత్తగా అడవిని నరికి సాగు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అటవీ భూముల సమస్యపై డీఎఫ్‌‌‌‌వో, కలెక్టర్‌‌‌‌, అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, బాధితుల సమక్షంలో చర్చించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్  కె.హరిత, అడిషనల్  కలెక్టర్  యువరాజ్  మమ్మాట్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎస్పీ నితికా పంత్, లైబ్రరీ చైర్మన్​ అనిల్, ఏఎంసీ చైర్​పర్సన్​ మంగ పాల్గొన్నారు.