కోల్ బెల్ట్, వెలుగు: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టూరిజం శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రం పాత మంచిర్యాలలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావుతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ‘సర్’తో ప్రభుత్వాలే కోల్పోయాయన్నారు. డబుల్ నేమ్స్, చనిపోయిన వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకు చేపట్టిన సర్ మంచిదేనన్నారు.
అయితే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మైనార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది లాంటిదన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు సర్ పై 2002 నుంచి 2026 ఓటరు లిస్టులను పరిశీలించాలన్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ‘సర్’పై రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డీసీసీ మాజీ ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖ, కార్పొరేటర్ నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
