ఊరంతా సర్కార్‌‌‌‌‌‌‌‌ బడికే... కామారెడ్డి జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న కన్కల్ గ్రామం..

ఊరంతా సర్కార్‌‌‌‌‌‌‌‌ బడికే... కామారెడ్డి జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న కన్కల్ గ్రామం..
  • ఈ ఏడాదే 163 మంది కొత్త స్టూడెంట్స్ చేరిక 
  • ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌కు తమ పిల్లలను పంపొద్దని గ్రామస్తుల నిర్ణయం 

కామారెడ్డి, వెలుగు: ఆ ఊరంతా ఒక్కతాటి పైకి వచ్చి సర్కార్‌‌‌‌‌‌‌‌ బడిని కాపాడుకోవాలని కంకణం కట్టుకుంది. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి చదువు అందుతుంటే, వేల రూపాయలు పోసి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లడం ఎందుకని ఆలోచించింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో ఊరు ఊరంతా తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్‌‌‌‌కు పంపిస్తూ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది.  

ఊరంతా కలిసి తీర్మానం 

కన్కల్​ గ్రామంలో ప్రీ ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు ఉంది. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఆ స్కూల్.. ప్రైవేట్ స్కూళ్ల ప్రభావంతో అడ్మిషన్లు తగ్గిపోయాయి. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. అందరూ కలిసి విద్యాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం నుంచి తప్పించుకునేందుకు సర్కార్ బడిని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. 

గ్రామస్తుల సహకారంతో తమ పిల్లలను గ్రామంలోని సర్కార్‌‌‌‌‌‌‌‌ బడికే పంపిస్తామని నిర్ణయానికి వచ్చారు. అలా జరగాలంటే సర్కార్‌‌‌‌‌‌‌‌ బడిలో వసతులతోపాటు నాణ్యమైన బోధన ఉండాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే బడిలో ఉన్న 15 మంది టీచర్లు కష్టపడి పనిచేశారు. గతేడాది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌‌‌‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అదనపు క్లాసులు నిర్వహించడంతో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల కంటే సర్కారు స్కూలే బెటర్ అనే అభిప్రాయం వచ్చింది. ఈ క్రమంలోనే దాతల సహకారంతో మరో ఆరుగురు ప్రైవేట్ టీచర్లను నియమించుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. 

రికార్డు స్థాయిలో అడ్మిషన్లు.. 

గ్రామస్తుల పట్టుదల, టీచర్ల కష్టం తోడై ఈ అకడమిక్ ఇయర్ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రీ ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు కొత్తగా 163 మంది విద్యార్థులు చేరారు. దీంతో స్కూల్‌‌‌‌లో విద్యార్థుల సంఖ్య 264కు చేరింది. హైస్కూల్‌‌‌‌లో ఈ ఏడాది ప్రారంభంలో టెన్త్ విద్యార్థులు పోను 41 మంది ఉంటే, ఇప్పుడు కొత్తగా 65 మంది చేరారు. దీంతో స్టూడెంట్ల సంఖ్య 106కు చేరింది. 

ఇందులో ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చిన వారే 41 మంది ఉన్నారు.  ప్రైమరీ స్కూల్‌‌‌‌లో గతంలో 60 మందికి ఉండగా ఈసారి 49 మంది కొత్తగా చేరారు. ప్రీ-ప్రైమరీలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా 50 మంది చిన్న పిల్లలు అడ్మిషన్ పొందారు. కాగా ఈ గ్రామం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి స్వగ్రామం కావడం విశేషం. 


ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం

స్టూడెంట్స్‌‌‌‌కు మెరుగైన బోధన చేయటంతో పాటు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. చదువుతో పాటు విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు, గేమ్స్,  కల్చరల్ యాక్టివిటీస్‌‌‌‌పై ఫోకస్​ చేశాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. టెన్త్ క్లాస్​స్టూడెంట్స్​ కోసం ఈ సంవత్సరం నుంచి సాయంత్రం స్పెషల్​ క్లాసులు నిర్వహిస్తున్నాం. 
- ఆశాజ్యోతి, హెచ్​ఎం. హైస్కూల్​

ప్రభుత్వ స్కూళ్లలోనే నాణ్యమైన చదువు 

ప్రభుత్వ స్కూళ్లలోనే మంచిగా చదువు చెబుతున్నారు. ప్రైవేట్‌‌‌‌లో కన్నా అన్ని రకాల వసతులతో పాటు, నైపుణ్యం గల టీచర్లు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమ ఊరి పిల్లలను ప్రభుత్వ స్కూల్‌‌‌‌లోనే చదివించుకోవాలని గ్రామస్తులంతా సమావేశమై నిర్ణయం తీసుకున్నాం. గ్రామస్తులంతా కలిసి స్కూల్‌‌‌‌ను అభివృద్ధి చేసుకుంటున్నాం. 
- రవీందర్​రెడ్డి, కన్కల్‌‌‌‌ గ్రామ సర్పంచ్