- మరణించిన వారిలో ముగ్గురు ఏపీ వాసులు
- పదిమంది తమిళనాడు, ఇద్దరు కేరళ పర్యాటకులు
- ఉవ్వెత్తున ఎగిసిపడ్డ అలల ధాటికి బోల్తా పడ్డ బోటు
- తీరానికి 400 మీటర్ల దూరంలో ప్రమాదం
- ప్రమాద సమయంలో బోటులో 36 మంది
- 21 మందిని కాపాడిన వియత్నాం కోస్ట్ గార్డ్
- తెలంగాణ నుంచి వెళ్లిన 40 మంది టూరిస్టులు సేఫ్
హోచిమిన్ సిటీ: వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత పర్యాటకులతో వెళుతున్న స్పీడ్ బోటు ఒకటి అలల ధాటికి అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పదిహేను మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్వాసులు కాగా పదిమంది తమిళనాడుకు చెందిన వారు, మరో ఇద్దరు కేరళ వాసులని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ప్రముఖ మొబైల్ సంస్థ ‘లావా’ నిర్వహించిన బిజినెస్ టూర్‌లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి మొత్తం 110 మంది డిస్ట్రిబ్యూటర్లు వియత్నాం వెళ్లారు. టూర్ లో భాగంగా ఫూ క్వాక్ ద్వీపం సందర్శించారు. అక్కడి నుంచి స్పీడ్ బోట్లో తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బోటులో 36 మంది ఉన్నారని సమాచారం. కాగా, విహారయాత్రకు వెళ్లిన వారు విగతజీవులుగా మారడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రమాదం ఎలా జరిగింది?
ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటిస్తున్న భారత పర్యాటకులు హాన్ మే రుట్ ఎన్గోయ్ ద్వీపం సందర్శించాక మధ్యాహ్నం అన్ థోయ్ పోర్టుకు బయలుదేరారు. ఓ స్పీడ్ బోట్లో 32 మంది భారతీయులు, నలుగురు సిబ్బంది ప్రయాణం ప్రారంభించారు. తీరం సమీపిస్తుండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు 400 మీటర్ల దూరంలో ఉన్నపుడు పెద్ద ఎత్తున అలలు ఎగసిపడటంతో పాటు బలమైన గాలులు వీచాయి.ఈ ఉధృతిని తట్టుకోలేక పడవ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో పడవలోని వారంతా సముద్రంలో పడిపోయారు.
రెస్క్యూ ఆపరేషన్..
సమాచారం అందిన వెంటనే వియత్నాం కోస్ట్ గార్డ్ అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో తీవ్రంగా శ్రమించి 21 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. పదిహేను మంది మరణించగా.. అందులో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి చెందిన జయలక్ష్మి గెల్లి, నల్లాపేట రవితేజ ఆదిశేషయ్య, శ్రీధర్ ముడియంలతో పాటు తమిళనాడుకు చెందిన 10 మంది, కేరళకు చెందిన ఇద్దరు టూరిస్టులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భారత ఎంబసీ అలర్ట్
ఈ దుర్ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు, మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సహాయం కోసం హోచిమిన్ సిటీలోని కార్యాలయాన్ని +84 36 281 7930 నంబర్‌లో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ఈ దుర్ఘటనపై వియత్నాం ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. పడవ సామర్థ్యం, వాతావరణ పరిస్థితులపై ముందస్తు హెచ్చరికల అమలులో వైఫల్యం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రపతి, ప్రధాని, రాహుల్ గాంధీ సంతాపం
వియత్నాంలో బోటు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వియత్నాంలో భారతీయ పౌరులు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, భారత రాయబార కార్యాలయం మరియు కాన్సులేట్ అధికారులు వియత్నాం అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఈ కష్టకాలంలో ప్రభుత్వం మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ వియత్నాం అధికారులతో కలిసి పనిచేసి, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. బాధితుల కుటుంబాలకు తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తూ, గల్లంతైన వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల వేదనను తాను అర్థం చేసుకోగలనని, తన ఆలోచనలు వారితోనే ఉన్నాయని పేర్కొన్నారు.
