హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే.. సిద్దిపేటలో హరీశ్ రావుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను సంగారెడ్డిలో మాత్రమే పోటీ చేయబోనని చెప్పానని.. ఇతర చోట పోటీచేయనని చెప్పలేదన్నారు.
రాబోయే పదేండ్ల పాటు సంగారెడ్డిలో తన భార్య నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఆ తర్వాత తన కొడుకా.. లేదంటే తన అనుచరులా.. అనేది చూడాలని అన్నారు. ఎంత పెద్దపులి అయినా సరే వేటగాడి వ్యూహానికి చిక్కి బోనులో పడాల్సిందేనని.. అలాగే, పార్టీలో ఎంత పెద్ద లీడర్ అయినా సరే తాను తోపును అంటే నడవదని, పార్టీ హైకమాండే తోపు అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ లీడర్ అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు నడుచుకోవాల్సిందేనని, రాష్ట్ర కాంగ్రెస్ లో వారే తోపులని చెప్పారు. డి లిమిటేషన్ ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కు 117 సీట్లు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం ఆయన ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారని అన్నారు.
. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ కు రిపోర్టులు వస్తాయని, ఆయన హెచ్చరించిన తర్వాతనైనా వారు తమ పనితీరును మార్చుకోవాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో పక్కనపెట్టే అధికారం రేవంత్ కు ఉంటుందన్నారు. పార్టీని కాదని, అంతా నేనే అని ఎవరైనా అనుకుంటే రాజకీయంగా కనుమరుగు కావాల్సిందేనని చెప్పారు. అధికార పార్టీపై బురదజల్లడమే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పని అని జగ్గారెడ్డి విమర్శించారు.
