హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను త్వరగా పూర్తి చేయిస్తామని, ఆ వెంటనే విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇందుకు సహకరించాలని ఆర్టీసీ జేఏసీ నేతలను కోరారు. జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, యాదగిరి, మౌలానా, యాదయ్య, బాబు, విశాల్, రాములు, ఇతర నేతలు శనివారం ఉదయం మినిస్టర్స్ క్వార్టర్‌లో మంత్రి పొన్నంను కలిశారు.
ఈ సందర్భంగా ముందు విలీన ప్రక్రియ ప్రారంభించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరిపించాలని కోరారు. గుర్తింపు సంఘం ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా జరిపించి, ఆ వెంటనే విలీన ప్రక్రియను చేపడ్తామని, ఈ విషయంలో తన మాటను నమ్మాలని జేఏసీ నేతలకు మంత్రి స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే సమ్మె విరమణ ఒప్పందంలో భాగంగా ఒక్కో హామీని అమలు చేస్తున్నామన్నారు.
విలీన ప్రక్రియను ప్రారంభించాలని మొండికిపోతే అటు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగక, ఇటు విలీన ప్రక్రియ ప్రారంభం కాకా.. నష్టపోయేది ఆర్టీసీ కార్మికులేనన్నారు. తమ మాటను విశ్వసించి గుర్తింపు సంఘం ఎన్నికలకు సహకరించాలని కోరారు. దీంతో సంతృప్తి చెందిన జేఏసీ నేతలు మంత్రి ప్రకటనకు సంబంధించి మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు.
సమ్మె విరమణ సందర్భంలో జేఏసీ నేతలకు ఇచ్చిన ఇతర హామీలపై మంత్రితో చర్చించామన్నారు. 2021 వేతన సవరణ ఏరియర్స్ చెల్లింపులపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికుల నుంచి వసూలు అయిన డబ్బులను సమ్మె సందర్భంగా ఆత్మబలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి ఇవ్వాలని, ఆయన కుమారుడికి సూపర్ న్యూమరరీ ఉద్యోగం ఇవ్వాలని మంత్రిని కోరారు. వీటిపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారని జేఏసీ నేతలు చెప్పారు.
