సీఎంతో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ

సీఎంతో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ
  • హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ ఏ-380 సర్వీసులకు సుముఖత

హైదరాబాద్, వెలుగు: భారత్‌‌లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన 25 వసంతాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్ మహానగరం నుంచి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘ఎమిరేట్స్ ఏ-380’ భారీ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సంస్థ వైస్ ప్రెసిడెంట్ సంపూర్ణ సుముఖత వ్యక్తం చేశారు.

దీనికి సీఎం స్పందిస్తూ..హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని సర్హాన్ ను కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో త్వరలో రాబోతున్న మరో రెండు కొత్త విమానాశ్రయాల్లో ఎమిరేట్స్ సంస్థ తన ఎమ్‌‌ఆర్‌‌ఓ ( మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌‌హాల్) ఆపరేషన్స్ ప్రారంభించాలని సీఎం ప్రతిపాదించారు.

ఎమిరేట్స్ సంస్థ విస్తరణకు, సర్వీసుల నిర్వహణకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే, గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో తెలంగాణ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు ఎమిరేట్స్ సంస్థ స్పాన్సర్‌‌షిప్‌‌తో ముందుకు రావాలని కోరారు. ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలకు మహమ్మద్ సర్హాన్ సానుకూలంగా స్పందించారు.