ముషీరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్ బీసీ భవన్‌లో శనివారం యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి అధ్యక్షతన వివిధ బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. జీవో నంబర్ 9ను రద్దు చేసి, పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్‌చేశారు.
బకాయిల కోసం ఈ నెల 14న ఇందిరాపార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష, 16న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో గురుకులాల డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం అదనంగా 150 బీసీ గురుకుల పాఠశాలలు, 120 కాలేజ్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలన్నారు. నాయకులు అనంతయ్య, రాజేందర్, గుజ్జ కృష్ణ, నిఖిల్ పటేల్, లక్ష్మి, అడ్వకేట్ శివకుమార్, రాజు నేత పాల్గొన్నారు.
