- మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి
- సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలి
- జిల్లా కలెక్టర్లతో వీసీలో మంత్రి పొంగులేటి ఆదేశాలు
ఖమ్మం టౌన్, వెలుగు: భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రంలో ల్యాండ్రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలెక్టర్లకు సూచించారు. భూముల రీ-సర్వే, భూ భారతి అమలు, సదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ, స్కూల్స్టూడెంట్లకు యూనిఫామ్‌ల అందజేత తదితర అంశాలపై మంత్రి, శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డీఎస్. లోకేశ్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో అందుకోలేకపోయామని మంత్రి చెప్పారు.
ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సా దాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, హైకోర్టు సమస్య కూడా పరిష్కరించినప్పటికీ అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. ఇందుకు కారణాలేంటో గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూముల రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందు కోసం శిక్షణ పొందిన లైసెన్సుడ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్సుడ్ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లైసెన్సుడ్సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు.
శుక్రవారం ముఖ్యమంత్రి ములుగుమాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. తొలి విడత ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్లు భూ రీ-సర్వేకు అవసరమైన సిబ్బంది, పరికరాలు, మౌళిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు. ప్రతి నెలా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని, మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
లైసెన్స్ సర్వేయర్లకు ఎకరాకు రూ.60 చెల్లింపు
రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 చొప్పున మొత్తం రూ.60 అందజేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్లకు గడువిచ్చి, గడువులోగా చేరని వారి లైసెన్సులు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. లైసెన్స్ఉన్న సర్వేయర్లకు బీమా, సామాజిక భద్రత కల్పించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక సర్వే నంబరులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరిస్తాం..
సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించి నోటీసులు త్వరితగతిన జారీ చేయాలని సూచించారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వచ్చిన 6,500 రెవెన్యూ సమస్యల్లో 98 శాతం సమస్యలకు భూ రీ-సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.
రీసర్వే పూర్తయితే సాదాబైనామాల క్లియరెన్స్ ఈజీ: లోకేశ్‌కుమార్
తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూ రీ-సర్వేను నవంబర్ లోపు పూర్తి చేయాలని, రెండో విడతలో మరో 70 గ్రామాల్లో (మార్చి-2027)లోపు పూర్తి చేయాలని లోకేశ్ కుమార్ ఆదేశించారు. రీ-సర్వే పూర్తయితే సాదాబైనామా దరఖాస్తుల తిరస్కరణ గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో గుడిసెలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఆగస్టు నాటికి రెండు లక్షల ఇండ్లు లక్ష్యాన్ని చేరుకోవాలని, పెండింగ్‌లో ఉన్న డబుల్బెండ్రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు. సెర్ప్ సీఈవో దివ్య మాట్లాడుతూ, ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల విద్యార్థుల యూనిఫామ్‌లన్నీ స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్ల ద్వారానే కుట్టిస్తున్నామని తెలిపారు. జులై 15లోపు రెసిడెన్షియల్ బాలికలకు, జులై 30లోపు బాలురకు యూనిఫాంలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తిచేయాలి..
మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న డబుల్బెడ్రూమ్ ఇండ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి, మిగిలిన పనులకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాని అర్హుల ఇండ్లను కూడా రెండో విడతలో చేర్చి మంజూరు చేయాలని సూచించారు.
