ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే : హరీశ్ రావు

ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే : హరీశ్ రావు
  • హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం.. తక్షణమే రాజీనామా చేయాలి: హరీశ్ రావు

హైదరాబాద్/సిద్దిపేట రూరల్, వెలుగు: షాబాద్‌‌ లో జరిగిన ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్​చేశారు. శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

మే 16న మైనర్ బాలికను వేధించిన నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని, అవినీతికి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి, నిందితుడికి కేవలం ఏడేండ్లలోపు శిక్షపడే సాధారణ సెక్షన్లు పెట్టి కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నెలరోజుల పాటు అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేయడంతో.. అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని ఆ కుటుంబాన్నే అంతం చేశాడన్నారు.

తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని, ఆ బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదని.. సరైన సమయంలో ఏసీపీ, డీసీపీ, కమిషనర్ స్థాయిలో సమీక్ష చేసి, కఠిన సెక్షన్లు పెట్టి ఉంటే ఈరోజు ఈ ఆరు హత్యలు జరిగి ఉండేవి కావన్నారు. ఆ కుటుంబంలో కేవలం ఒకే ఒక అమ్మాయి మిగిలిందని, ఆ అమ్మాయికి మాటలు రావు, చెవులు వినబడవు, నడవలేని వికలాంగురాలని, ఆమె పేరు మీద ప్రభుత్వం వెంటనే రూ. కోటి రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని, ఆ అమ్మాయిని పెంచి, సంరక్షించే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

సీఎం డైవర్షన్ డ్రామాలు

ప్రభుత్వ పాలనా వైఫల్యాలు బయటపడ్డప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ డ్రామాలకు తెరలేపడం సీఎం రేవంత్​రెడ్డికి పరిపాటిగా మారిందని హరీశ్​రావు ఆరోపించారు. శనివారం మీడియా సమావేశంలో సీఎం మాట్లాడిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని విమర్శించారు. రైతులు నీళ్లు అడిగితే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వమని చెప్పితే.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి అనడం, బెల్టుతో కొట్టాలి అని మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్​రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు, రైతులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు.