పద్మారావునగర్, వెలుగు: పోక్సో బాధితురాలితోపాటు మొత్తం ఆరుగురిని ఓ కిరాతకుడు పొట్టనబెట్టుకున్న ఉదంతంలో పోలీసుల వైఫల్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. బాధితుల ఫిర్యాదులను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేశ్‌పై కమిషన్ కేసు నమోదు చేసింది. తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని సాగించిన న్యాయపోరాటంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
గతంలో బాధితురాలి తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పుడే బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాటి షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేశ్ ఆ ఫిర్యాదును పూర్తిగా పక్కనబెట్టి, ఘోరమైన నిర్లక్ష్యం వహించారని న్యాయవాది రామారావు ఇమ్మనేని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల ఈ ఉదాసీనతే నిందితుడికి ఆసరాగా మారి, చివరకు ఆరుగురి ప్రాణాలు పోవడానికి కారణమైందని ఆయన కమిషన్ ముందు బలంగా వాదించారు.
ఈ నేపథ్యంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు డిమాండ్ చేశారు. నిందితుడికి కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూడటంతో పాటు బాధితురాలి కుటుంబంలో బతికి ఉన్న మిగిలిన సభ్యులకు తక్షణమే పోలీస్ రక్షణ కల్పించాలని కోరారు. అలాగే, బాధితుల కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
