- 200 గంటల భాషా పదాల రికార్డింగ్
- ఆగస్టు 15న అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం
- ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రత్యేక చొరవతో సాకారం
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండీ, కొలాం భాష మాట్లాడే ఆదివాసీల్లో చాలా మందికి తెలుగు అంతగా రాదు. తమ వ్యక్తిగత సమస్య తెలియజేయాలన్నా.. అధికారులను కలిసి విన్నవించాలన్నా.. తెలుగువచ్చిన వారి సహాయం తప్పనిసరి. ఇప్పటికీ మధ్యవర్తులు లేకుండా కలెక్టరేట్, ఐటీడీఏకు వెళ్లలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు నిర్ణయించారు.
ఏఐ యాప్ లలో భాష అనువాదం చేసుకునే వెసులుబాటు ఉండడంతో, గోండీ,కొలామి భాషను తెలుగులో అనువాదం చేసేందుకు ఐటీడీఏ ఒక ప్రత్యేక మిషన్ రూపొందిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ట్రిపుల్ ఐటీతో ఒప్పందం కదుర్చుకున్నారు. ఏఐ ద్వారా గోండీ, కొలాం భాషలను తెలుగులోకి, తెలుగును గోండీ, కొలాం భాషల్లోకి అనువాదం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గోండీ, కొలాం భాషలు సులువుగా అర్థమయ్యేలా ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నామని, మిషన్ అందుబాటులోకి వచ్చాక భాషతో పాటు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు పొందుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
తీరనున్న తిప్పలు..
గోండీ, కొలామి భాషలను స్వేచ్ఛా యాప్ లో నిక్షిప్తం చేసేందుకు రెండు నెలలుగా రెండు భాషలకు సంబంధించిన 20 వేల పదాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే 18 వేల గోండీ, 14 కొలాం వాక్యాలను సేకరించారు. 200 గంటల పాటు గోండీ, కొలామి భాషల పదాలను రికార్డింగ్ చేయనున్నారు. ఇందులో ఇప్పటికే 20 గంటల రికార్డింగ్ పూర్తి చేశారు. పెసా మొబలైజర్లు, సూపర్ వైజర్లు, రాయిసెంటర్ పెద్దలు, గ్రామ పటేళ్ల నుంచి వీలైనన్ని పదాలను సేకరిస్తున్నారు. వీటిని అనువదించి యాప్ లో పొందుపరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలుగు మాట్లాడలేని ఆదివాసీల ఇబ్బందులు తీరుతాయి.
మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో పొందుపర్చే ఏఐ యాప్ ద్వారా గోండీ, కొలాం భాషలో మాట్లాడితే క్షణాల్లో మనకు ఆడియో లేదంటే టెక్ట్స్ రూపంలో వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులకు గిరిజనులు తమ సమస్యలను సులువుగా చెప్పుకొనేందుకు అవకాశం కలగనుంది. అలాగే గోండీ, కొలాం భాష రాని అధికారులు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఐటీడీఏ ఆఫీస్లో వాక్యాల సేకరణను గోండీ భాష కో ఆర్డినేటర్ దేవరావు, కొలాం భాష కో ఆర్డినేటర్ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. గోండీ, కొలా భాషలకు సంబంధించి ఎవరైనా ఇంకా తప్పిపోయిన పదాలు చెప్పాలనుకుంటే 9492585451, 9492128599లో సంప్రదిస్తే తాము రికార్డు చేసుకుంటామని అధికారులు
చెబుతున్నారు.
ఇబ్బందులు దూరం చేసేందుకే..
గోండీ, కొలామి భాష మాట్లాడే వారికి తెలుగు రాక తమ సమస్యను అధికారులకు చెప్పుకోలేకపోతున్నారు. ఈ సమస్యను తీర్చేందుకు భాష మిషన్ ను తయారు చేస్తున్నాం. ఇంగ్లీష్ మాదిరిగానే గోండీ, కొలాం భాష అందరికీ అర్థం అయ్యేలా, ఆదివాసీ భాష, సంస్కృతిని కాపాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు 15న మిషన్ అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నాం. మిషన్ వచ్చిన తర్వాత యాప్ లలో పొందుపర్చుతాం.
– మంద మకరందు, పీవో, ఐటీడీఏ ఉట్నూర్-
