- మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఒకే వ్యక్తికి సంబంధించిన 404 ఆర్టీఐ పెండింగ్ అప్పీళ్లను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సమాచార కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రతి అప్పీల్‌కు విడివిడిగా నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. ఈ కేసుల విచారణను మూడు నెలల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. జన తెలంగాణ రైట్స్ సొసైటీ కార్యదర్శి వి.శ్యామ్ దాఖలు చేసిన 404 ఆర్టీఐ అప్పీళ్లపై సమాచార కమిషన్ ఒకేసారి నోటీసులు జారీ చేసి, ఉమ్మడిగా విచారణ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
గతంలోనే ప్రతి అప్పీల్‌ను విడివిడిగా విచారించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, ఆ ఉత్తర్వులు అమలు కాలేదని పేర్కొంటూ ఆయన మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సూరేపల్లి నంద విచారించారు. కేసులవారీగా తిరిగి నోటీసులు జారీ చేసి, మూడు నెలల్లోపు అన్ని అప్పీళ్లను పరిష్కరించాలని సమాచార కమిషన్‌ను ఆదేశించారు. అవసరమైతే ఆన్‌లైన్ విధానంలో కూడా విచారణ చేపట్టాలని సూచించారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను ముగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
