ఒక డ్రైవరు లైసెన్స్ పరీక్షలో 100కి 100 మార్కులు సాధించాడు. కానీ రోడ్డు పైకి వచ్చాక కారు కూడా సరిగ్గా నడపలేకపోయాడు. ఇప్పుడు సమస్య డ్రైవరులో ఉందా ? లేక కేవలం కాగితాల మీద మార్కులను మాత్రమే చూసే పరీక్షా విధానంలో ఉందా? ఈ ప్రశ్నలను ఇప్పుడు మన విద్యావ్యవస్థకు కూడా వర్తింపజేయాల్సిన సమయం వచ్చింది.
ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి ఫలితాలు దేశదృష్టిని ఆకర్షించాయి. మొత్తం 5,16,815 మంది విద్యార్థులలో కేవలం 4,844 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఫలితంగా 99.07 శాతం ఉత్తీర్ణతతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం సాధించింది. ఇది నిస్సందేహంగా అభినందించదగ్గ విషయమే. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల శ్రమ, ప్రభుత్వ చర్యలను ప్రశంసించాల్సిందే.
అయితే ఈ విజయం విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యం, నాణ్యతకు కూడా ప్రతిబింబమా ? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరీక్షల్లో వచ్చిన మార్కులు, విద్యార్థుల వాస్తవ సామర్థ్యాన్ని ఎల్లప్పుడూ ప్రతిబింబించవని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ప్రతి సంవత్సరం ప్రథమ్ ఫౌండేషన్ నిర్వహించే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్
( ఏఎస్‌ఈఆర్) దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ప్రాథమిక అభ్యాస సామర్థ్యాలను అంచనా వేస్తోంది. తెలంగాణకు సంబంధించిన తాజా నివేదికలో 6 నుంచి 8వ తరగతి విద్యార్థుల్లో 54 శాతం మంది రెండో తరగతి స్థాయి పాఠ్యాంశాన్ని కూడా సరిగా చదవలేకపోతున్నారు. అలాగే 65 శాతం మంది సాధారణ కూడికలు, తీసివేతలు చేయలేకపోతున్నారు.
ఒకవైపు దాదాపు అందరూ పదో తరగతి ఉత్తీర్ణులు అవుతుంటే, మరోవైపు ప్రాథమిక నైపుణ్యాల్లో ఇంత వెనుకబాటు కనిపించడం ఆలోచించాల్సిన విషయమే. ఈ పరిస్థితిని ప్రపంచ విద్యా ప్రమాణాల కోణంలో చూస్తే మరింత స్పష్టత వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులో గణితం, సైన్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలను అంచనా వేసే రెండు ప్రపంచస్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షలు పీఐఎస్‌ఏ, టీఐఎంఎస్‌ఎస్. ఈ పరీక్షల్లో పాఠ్య పుస్తకాన్ని ఎంత బట్టీ పట్టారనేది కాదు, నేర్చుకున్న జ్ఞానాన్ని నిజ జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నారనేదే ప్రధాన ప్రమాణం.
గణితం, సైన్స్ నైపుణ్యాలు అంచనా వేయాలి
భారతదేశం 2009లో తొలిసారిగా పీఐఎస్‌ఏ పరీక్షలో పాల్గొంది. అయితే కేవలం హిమాచల్ పద్రేశ్, తమిళనాడు రాష్ట్రాల విద్యార్థులే పాల్గొన్నారు. ఫలితం మాత్రం దేశాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. 73 దేశాలు పాల్గొంటే భారత్ 72వ స్థానంలో నిలిచింది. ఆ ఒక్క ఫలితం ప్రపంచ విద్యా ప్రమాణాలలో భారత్ ఎంత వెనుకబడి ఉందో స్పష్టం చేసింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2009లో తొలిసారి పాల్గొన్న భారత్, అదే చివరిసారి అవుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఇక టీఐఎంఎస్‌ఎస్ పరీక్షలో కూడా భారత్ చాలాకాలంగా పాల్గొనడం లేదు.
ఫలితంగా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన విద్యార్థుల గణితం, సైన్స్ నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో నిరంతరంగా అంచనా వేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నాం. ప్రపంచ దేశాలు ఈ పరీక్షల ఫలితాలను ఆధారంగా చేసుకుని తమ విద్యా విధానాల్లో మార్పులు చేసుకుంటుంటే, మనం మాత్రం ఇంకా బోర్డు పరీక్షలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. పాస్ శాతం పెరగడం తప్పు కాదు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలని కోరుకోవడం కూడా తప్పు కాదు. కానీ ఉత్తీర్ణత శాతం పెరగడం, అభ్యాస నాణ్యత పెరగడం రెండూ ఒకటేకాదని గుర్తించాల్సిన సమయం వచ్చింది.
విద్యార్థులు జీవితాన్ని ఎదుర్కొనే నైపుణ్యాన్ని అందించాలి
ఒక విద్యార్థి పదో తరగతి పూర్తి చేసిన తర్వాత సులభంగా చదవలేకపోతే, సాధారణ లెక్కలు చేయలేకపోతే, తనకు తెలిసిన విషయాన్ని కొత్త పరిస్థితుల్లో ఉపయోగించలేకపోతే, అతనికి వచ్చిన మార్కులు సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతాయనే ప్రశ్నకు సమాధానం చెప్పా ల్సిందే.
పీఐఎస్‌ఐ, టీఐఎంఎస్‌ఎస్ వంటి పరీక్షలకు ప్రత్యేక సిలబస్ ఉండదు. అక్కడ పరీక్షించేది విద్యార్థి ఎంత బట్టీపట్టాడో కాదు, ఎంత అర్థం చేసుకున్నాడు, ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఎలా ఉపయోగించగలడు అనేదే. అందుకే భారత్ ప్రపంచ స్థాయిలో నిలవాలంటే పాఠ్య పుస్తకాలను మాత్రమే మార్చడం కాదు, బోధనా విధానం, ప్రశ్నాపత్రాల రూపకల్పన, మూల్యాంకన విధానాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది.
విద్యార్థులు మార్కుల కోసం కాదు, ఆలోచించే సామర్థ్యం కోసం నేర్చుకునే విద్యా వ్యవస్థను నిర్మించినప్పుడే పీఐఎస్‌ఏ వంటి అంతర్జాతీయ పరీక్షల్లో భారత్ అగ్రస్థానంలో నిలవగలదు. విద్యా ర్థికి సర్టిఫికెట్ ఇవ్వడం విద్యా వ్యవస్థ బాధ్యతలో ఒక భాగం మాత్రమే. కానీ జీవితాన్ని ఎదుర్కొనే నైపుణ్యాన్ని ఇవ్వడమే అసలైన బాధ్యత. 99.07 శాతం ఉత్తీర్ణత ఒక విజయమే.
అయితే అంతశాతం మంది విద్యార్థులు ప్రపంచ ప్రమాణాలైన పీఐఎస్‌ఏ, టీఐఎంఎస్ఎస్ వంటి పరీక్షల్లోనూ అదేస్థాయి ప్రతిభ కనబరిచినరోజే, మన విద్యా వ్యవస్థ నిజంగా ప్రపంచ స్థాయికి చేరుకుందని గర్వంగా చెప్పగలం. పాస్ శాతాలను కాదు, అభ్యాస నాణ్యతను పెంచే దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.
రక్షిత్ వర్మ
- ఓపెన్పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
