విద్యార్థులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అన్యాయం : తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ

విద్యార్థులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అన్యాయం : తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ

కాచిగూడ, వెలుగు: బ్యాంకు లోన్లు ఎగవేసే వారిపై ప్రయోగించే రెవెన్యూ రికవరీ యాక్ట్‌‌ను విద్యార్థులపై అమలు చేయడం అన్యాయమని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ అన్నారు. ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిల పేరుతో విద్యార్థుల కుటుంబాలపై ఈ చర్యలు చేపట్టడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కాచిగూడలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు భరోసా కల్పించేలా సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 

ఏళ్ల తరబడి పెండింగ్‌‌లో ఉన్న దాదాపు రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని తేవాలని, సర్టిఫికెట్ల నిలిపివేతను ఆపాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు అర్జున్, తేజు, రుద్రాన్ష్, దేవాన్ష్, హరీశ్, ప్రణయ్   పాల్గొన్నారు.