1990లో మండల్ రిజర్వేషన్ల ఉద్యమానికి వ్యతిరేకంగా రామమందిర నిర్మాణ ఉద్యమాన్ని ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, బీజేపీలు పెద్ద ఎత్తున మొదలుపెట్టాయి. ఆనాడు వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది కూడా ఈ అంశాన్ని ముందుపెట్టే. ఆనాడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ కూడా ఓబీసీ రిజర్వేషన్ల అనుకూల పార్టీ కాదు. అది ఈ ఉద్యమానికి పరోక్షంగా సహకరించింది. ఆ తరువాత మత కల్లోలాలు, కోర్టు కేసులు, ప్రభుత్వాలు మారుడు.
ఇవన్నీ జరిగి చివరికి ఆ టెంపుల్ అంశం పైనే 1999లో బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. ఈ మార్పు రావడానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు.. ముస్లిం సమస్యను ఈ దేశంలో 800 సంవత్సరాల ముస్లిం పాలకుల దోపిడీనే అని హిందూ మతానికున్న ప్రమాదాన్ని బాగా ప్రచారం చేశారు. శూద్రులు, దళితులు, ఆదివాసులు దాన్ని నమ్మారు. శ్రీరాముడు అందరి రక్షకుడని చెప్పారు. కానీ రామమందిరం నిర్మాణమైన 4 సంవత్సరాలలో రాముని ధనమే స్మగుల్ చేశారు. ఇక ప్రజలొక లెక్కా!
రామటెంపుల్ ట్రస్ట్ నిర్మాణం దేశ ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రకటించి చేశారు. దానికి ‘తన వ్యక్తి’ అనే చంపత్‌రాయ్‌ని జనరల్ సెక్రటరీని చేశాడు. దాన్ని పార్లమెంటు ఆమోదించింది అనిపించారు. ఆ ట్రస్ట్ వేలకోట్లు మాయం చేసింది అని బయటపడగానే ఇది ప్రైవేటు ట్రస్ట్ అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రధాన మంత్రి, హోం మంత్రి, ఫైనాన్స్ మంత్రి మాకేం సంబంధం లేదంటూ మాట్లాడటం లేదు. మరి ప్రధాన మంత్రి పార్లమెంటులో ట్రస్ట్ నిర్మాణం ఎందుకు పెట్టినట్టు? అది ప్రైవేటు ఎలా అవుతుంది? అది కేంద్ర ప్రభుత్వ ట్రస్ట్. కానీ ఇప్పుడు అది ప్రైవేటు ట్రస్ట్ అని తన బాధ్యతను తప్పించుకొంటున్నారు. పోనీ దాన్ని కాలక్రమేణా యూపీ ప్రభుత్వం ఎండోమెంటుకు కూడా ట్రన్స్‌ఫర్ చేయలేదు.
యూపీ సీఎం ఆ రాష్ట్రంలో ఇంత ఘోరం జరుగుతుంటే, శ్రీరాముని డబ్బు రాష్ర్టంలో దోపిడీ జరుగుతుంటే తనకేమీపట్టనట్టు నాలుగేండ్లు గడిపాడు. ఇప్పుడు ఆయన పోలీసు సిట్ వేసి ఇన్వెస్టిగేట్ చేస్తే ఎలా నమ్ముతారు? ఇది మామూలు దొంగతనం కాదు కదా! రాముడి సొమ్ము స్మగ్లింగ్. దాని బాధ్యత మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లది.
యావత్తు దేశం వాళ్లు వంద ఏండ్లుగా ప్రచారం చేసుకుని బతుకుదెరువు సాగించిన రాముని పేరుతో జమ అయిన కోట్ల కొద్దీ ధనాన్ని ప్రజలకు ఉపయోగించకుండా దోచుకుపోతున్న స్థితిలో కూడా రాజీనామా చేయకుండా ఉన్నప్పుడు ఎలా సహిస్తుంది. మొత్తం దేశం ఆ ముగ్గురిని దిగిపొమ్మని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది.
ఈ అంశంలో ప్రతిపక్షాల ఐక్య పోరాటమేదీ ?
ఇండియా అలయన్స్, ఇతర పార్టీలు, సంఘాలు ఈపాటికే ఐక్యంగా మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌ల రాజీనామా కోసం, మోహన్ భగవత్దేశానికి క్షమాపణ చెప్పి ఆ పదవి నుంచి దిగిపోవాలనే నినాదాలతో శాంతియుతంగా పోరాటం మొదలెట్టి ఉండాల్సింది. కానీ ఆ చైతన్యమే కనపడుట లేదు. శ్రీరామ టెంపుల్‌లో జరిగిన దోపిడీ మామూలు కరప్షన్ కాదు. అది ఈ మధ్యనే మొదలైంది కాదు.
దేశం తాము సిట్‌ను నమ్మడం లేదని చెబుతున్నప్పటికీ అదే సిట్ 70 సార్లు టెంపుల్ నుంచి డబ్బు, ఇతర విలువైన ఆభరణాలు దొంగిలించబడ్డాయని చెబుతున్నది. కాంగ్రెస్(యూపీఏ) అధికారంలో ఉన్నప్పుడు ఆసియా గేమ్స్ సందర్భంగా జరిగిందని చెప్పిన కరప్షన్ మీద ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలే వెనుక ఉండి అన్నాహజారే, కేజ్రీవాల్‌లను రంగంలోకి తెచ్చి ఆ ప్రభుత్వాన్ని గందరగోళంలోకి నెట్టలేదా!. మరిప్పుడు ప్రతిపక్షాలు, కమ్యూనిస్టులతో సహా ఎందుకు సైలెంటుగా ఉంటున్నాయి?
స్పిరిచ్యువల్ స్మగ్లింగ్ అంటే ఏమిటి ?
నేను గతంలో సోషల్ స్మగ్లింగ్ గురించి ఇంగ్లిష్, తెలుగులో చాలా రాశాను. దానిమీద చాలా చర్చ జరిగింది. ఇప్పుడు శ్రీరామ టెంపుల్‌లో జరిగినదాన్ని స్పిరిచ్యువల్ స్మగ్లింగ్ అని ఎందుకు అంటున్నాను? స్పిరిచ్యువాలిటీ మానవ నమ్మకానికి సంబంధించిన సమస్య. ఉదాహరణకు దేవునిపై బలంగా నమ్మే వ్యక్తులు ఆ నమ్మకంతో తమకున్న వనరులలో ఆ దేవుని పేరుతో దాన్ని నడిపే మనుషులకే ఇస్తారు. అది గుడికావొచ్చు. చర్చి కావొచ్చు. మసీద్ కావొచ్చు. ఆ సొమ్మును దేవుడు స్వయంగా తీసుకోడు.
దేవుని పేరుతో ఉన్న స్థలాన్ని మేనేజ్ చేస్తున్న మనుషులు ఆ సొమ్మును తీసుకుంటారు. ఏ స్థితిలోనూ దేవుడు ఆ సొమ్మును తినడు. నగలిస్తే తాను వేసుకొని తిరగడు. ఆ సంస్థను నడిపే మనుషులు ఆ సొమ్మును తిరిగి ప్రజల అవసరాలకు వాడకుండా తమ సొంతం కోసం వాడుకుంటే ఆ సొమ్ము తిరిగి ప్రజల్లోకి రాదు.
ఒక దేశం బార్డర్లు దాటిపోయిన సొమ్ము ఎలాగైతే తిరిగి మళ్లీ ఆ దేశానికి రాదో, ఆ సంస్థను నడిపే వ్యక్తులు భక్తులు నమ్మకంతో ఇచ్చే సొమ్మును తమ సొంతానికి వాడుకుంటే అది స్మగ్లింగే. స్మగ్లింగ్‌లో ముఖ్యంగా పెద్ద మొత్తాలు ఇన్‌వాల్వ్ అయి ఉంటాయి. చిన్న మొత్తాలు బతుకు గడపడానికి వాడుకుంటే వదిలేయవచ్చు.
కానీ, వందల కోట్లు, కిలోల బంగారం, టన్నుల వెండి ఏండ్లు ఏండ్లు దోచుకుంటే దాన్ని కచ్చితంగా స్మగ్లింగ్ అనే అనాలి. ఇందులో ఒకరిద్దరు కాదు. ఒక పెద్ద వ్యవస్థ ఇన్‌వాల్వ్ అయిందని సిట్టే చెబుతున్నది. నమ్మకంతో అన్ని వర్గాలు, కులాలు, భక్తులు ఇచ్చిన సొమ్మంతా ఇలా స్మగ్లింగ్ చేయబడితే ట్రస్ట్‌ను ఏర్పరిచిన కేంద్ర ప్రభుత్వం అది ప్రయివేటు సంస్థ పని అంటే దేశం ఎలా నడుస్తుంది? ఇక్కడే అసలు ప్రమాదం ఉంది.
రామ టెంపుల్.. వాటికన్‌కు, మక్కాకు దీటు అన్నారు
అటువంటప్పుడు దాన్ని ఎలా నడపాల్సి ఉండే. అది ప్రారంభమై నాలుగేండ్లు కాకముందే ఇంత స్మగ్లింగ్ ఎలా జరిగింది? ఈ ట్రస్ట్ దేశ ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రకటించి ఏర్పరిచింది కదా! ఇంతకాలం మొత్తం ట్రస్ట్ ఏం చేస్తుంది. పరాసరన్ దాని అధ్యక్షుడు కదా. ఆయన ఎప్పుడూ టెంపుల్ ఆదాయాన్ని రివ్యూ చేయలేదా! ఇక్కడే ప్రజలకు అనుమానం ఉంది. వాటికన్‌లో కూడా కరప్షన్ జరిగింది. కానీ అది ఏర్పడ్డాక 1300 ఏండ్లకు స్వర్గానికి సర్టిఫికెట్ఇస్తామని చెప్పి డబ్బు దండుకున్నారు.
మతాతీత మూఢ నమ్మకాలను ప్రచారంచేసే డబ్బులు సంపాదించుకున్నారు. పోపులు, బిషప్‌లు, ఫాస్టర్లు స్త్రీలను చరిచారు. కానీ అతికొద్ది రోజుల్లో పెద్ద తిరుగుబాటును ఎదుర్కొన్నారు. అక్కడే మార్టిన్ లూధర్ పుట్టాడు. నమ్మకాన్ని దోచుకుంటే దాన్ని మతం అనరు. అందుకని మొత్తం క్రిస్టియన్ మతాన్నే సంస్కరించే ఉద్యమం మొదలైంది. ప్రతి సంస్థ సంస్కరణకు గురైతే తప్పనేది చాలాకాలం బతకదు.
మక్కాలో కూడా లంచగొండితనం వల్ల ఉద్యోగులు పట్టుబడ్డారు. కానీ ఆ లంచగొండితనం చిన్న చిన్న మొత్తాలను వ్యక్తిపరం చేసుకున్నది. అయితే ఇస్లామ్‌లో బాగా సంస్కరణలు వచ్చినా తిరుగుబాట్లు రాలేదు. అందుకే అది కదలిక లేని నీళ్లలా ఉన్నది. కొత్తగా నిర్మించిన రామమందిరం ఆరంభం నుంచి దాని ట్రస్ట్ తీవ్రమైన ఆర్థిక దోపిడీకి అవకాశమిచ్చింది.
అదీ కేంద్ర ప్రభుత్వం మొత్తంగా గుడిపనిలో ఉండి సుప్రీంకోర్టు డైరక్షన్‌లో ఒక ట్రస్ట్ఏర్పాటుచేసి దాన్ని ప్రైవేటు ట్రస్ట్ అని ఎందుకు ప్రకటించారు. ఆ ట్రస్ట్ ఇంత ఘోరంగా ఎందుకు పట్టుబడ్డది? దానికిముందు కేవలం చిన్న ఉద్యోగులను అరెస్టు చేయడం. పెద్ద బాధ్యులను పదవుల నుంచి తప్పించడం కాదు చేయాల్సింది. దీనికి కేంద్రం కూడా బాధ్యురాలు.
మతం రాజ్యాన్ని నడిపిస్తే..
మతం రాజ్యాన్ని నడిపిస్తే మునుముందు ఈ దేశం చాలా పెద్ద తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటుంది. మతశక్తులు రాజ్య వ్యవహార సంస్థల్ని తమ అధీనంలో ఉండాలని తీవ్రంగా పనిచేస్తాయి. అది రాజ్య సంస్థలను తమ అధీనంలోకి తెచ్చుకుంటాయి.
భక్తితో నిరంతర మానవ ప్రవర్తనను అదుపులో పెట్టడం సాధ్యంకాదు. అందుకే రాజ్యాంగం ద్వారా ఏర్పరిచిన చట్టపర సంస్థలు మతాలకతీతంగా వ్యక్తుల ప్రవర్తనను నిరంతరం ప్రయత్నించాలి. మతపర సంస్థలు మేం చట్టానికి లోబడి కాదు మత నియమాలకు లోబడి పనిచేస్తామంటే రాజ్యవ్యవస్థ ఆ ఉనికిని కొనసాగిస్తే మొత్తం రాజ్యాంగ వ్యవస్థకే ప్రమాదం ఏర్పడుతుంది.
సెక్యులర్ రాజ్య పర్యవేక్షణ రాజ్యాంగబద్ధంగా లేకుంటే మతసంస్థలు ఎలా పనిచేస్తాయో అయోధ్య రామమందిర వ్యవహారం బయటపెట్టింది. అయితే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు సెక్యులర్ రాజ్యవ్యవస్థ అవసరం లేదని ముస్లిం దేశాలలోని థియోక్రాటిక్ వ్యవస్థవలె ఈ దేశ రాజ్యవ్యవస్థను మార్చాలనే క్రమంలో ఉన్నాయనేది తెలిసిందే.
ఆ సిద్ధాంతంతోనే ఆర్‌ఎస్‌ఎస్ గత 100 ఏండ్లుగా రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తోంది. తమ సంస్థ హిందూమతంలాంటిదే కనుక రిజిస్ట్రేషన్ తమకు అవసరంలేదు అంటుంది. ఈ విధంగా కొనసాగే సంస్థలు ముస్లిం దేశాల్లో చాలా ఉన్నాయి. అవి రాజ్యాంగ చట్టబద్ధతను ఉనికిలోకి రానివ్వడం లేదు. ఈ స్థితే ఇక్కడ రావొచ్చు. అయితే అటువంటి రాజ్యాంగేతర సంస్థలు ఎలా నడుస్తాయో రామ టెంపుల్ ట్రస్ట్ నిరూపించింది.
ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
- ఓపెన్పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
