నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ నిరసన...కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ నిరసన...కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: నీట్–2026 పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. శనివారం ఆర్టీసీ క్రాస్‌‌రోడ్స్ వద్ద ఫెడరేషన్​నాయకులు నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజినీకాంత్, టి.నాగరాజు మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పేపర్ లీకేజీల వల్ల 22.79 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేంద్రం పరీక్షా వ్యవస్థను కోచింగ్ మాఫియాకు, కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపి, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, విద్యార్థులకు పరిహారం అందించడంతోపాటు రాష్ట్రాలకు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే హక్కు కల్పించాలని డిమాండ్​చేశారు. ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు ఎం.మమత, పలువురు నాయకులు పాల్గొన్నారు.