- కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బీజేఎల్పీ నేత ఏలేటి వినతి
హైదరాబాద్, వెలుగు: పటాన్ చెరు (నాగలాపల్లి) – ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని మంజూరు చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. శనివారం హైదరాబాద్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను మహేశ్వర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. పటాన్ చెరు నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన ఈ కొత్త లైన్‌కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేసిందని, 136.503 కిలోమీటర్ల మేర డీపీఆర్ ను 2025 అక్టోబర్‌లోనే రైల్వే బోర్డుకు సమర్పించిందని గుర్తుచేశారు.
నివేదిక అందించి ఏడాది కావస్తున్నా ఇంకా అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ ప్రాజెక్టును త్వరగా ఆమోదించి రైల్వే ‘పింక్ బుక్’లో చేర్చాలని ఆయన కోరారు. ఈ కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే నిర్మల్, ఆర్మూర్, ఆదిలాబాద్ ప్రాంతాల ఆర్థిక, పారిశ్రామిక స్థితిగతులు మారిపోతాయని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా నిర్మల్ కొయ్యబొమ్మలకు దేశవ్యాప్తంగా కొత్త మార్కెట్లు లభిస్తాయని, వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ ‘మినీ యూఎస్ఏ’గా పేరుగాంచిన అంకాపూర్ గ్రామానికి ఈ లైన్ ఎంతో మేలు చేస్తుందని వివరించారు.
విద్యార్థులకు హైదరాబాద్, కరీంనగర్, నాందేడ్ యూనివర్సిటీలకు చేరుకోవడం సులభమవుతుందని తెలిపారు. అలాగే, పశ్చిమ తీరం నుంచి ఈశాన్య భారత్‌కు వెళ్లే సరుకు రవాణాకు ఇది అత్యంత తక్కువ దూరంతో కూడిన మార్గమవుతుందని, ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
