సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

హైదరాబాద్ :తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో బేగంబజార్ పోలీసులు నాగార్జున యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్‌లో పాల్గొన్న నాగార్జున యాదవ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్ అంటూ... దేశంలోనే అత్యంత దారుణంగా ఒక డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అయ్యాడంటూ  సెటైర్లు వేశారు.  అంతేకాదు, రేవంత్ రెడ్డికి ప్రభుత్వ జీవోలు కూడా చదవడం రాదంటూ వ్యాఖ్యానించారు. 

ముఖ్యమంత్రిపై ఈ విధమైన కించపరిచే వ్యాఖ్యలు చేయడంపై  టిపిసిసి సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదుతో బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలోనే గుంటూరులోని నాగార్జున యాదవ్ నివాసానికి వెళ్లిన తెలంగాణ పోలీసులు... ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే అరెస్ట్ చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా... స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తామని చెప్పి పోలీసులు నాగార్జున యాదవ్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ అరెస్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.