కాలనీలకు కీడు సోకిందని..అడవిలో చెట్లకింద కీడు వంటలు..పొద్దంతా అక్కడే

కాలనీలకు కీడు సోకిందని..అడవిలో చెట్లకింద కీడు వంటలు..పొద్దంతా అక్కడే

కరీంనగర్ లో ఆసక్తికర సంఘటన..జమ్మికుంట మున్సిపాలీటీలో కాలనీలు కాలనీలే ఖాళీ అయ్యాయి. వీధుల్లో ఒక్కరూ కనిపించలేదు.. ప్రతి ఇంటికి తాళం వేసి ఉంది. వృద్దులు, చంటిపిల్లలు సహా అంతా అడవి బాట పట్టారు. అడవుల్లో చెట్లకింద వండుకుని తిన్నారు. పొద్దంతా అక్కడే గడిపారు. ఎందుకీ పరిస్థితి అంటే.. కాలనీలకు కీడు సోకింది.. ఇండ్లు వదిలిపెట్టి  కీడువంటలకు దోషం పోతుందని చెబుతున్నారు కాలనీ వాసులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రెండు వార్డుల ప్రజలు కీడువంటలకు వెళ్లిన ఘటన చోటు చేసుకుంది .. వివరాల్లోకి వెళితే.. 

ఆదివారం (జూలై12) పొద్దుపొద్దున్నే జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 13,14 కాలనీల్లో ఒక్కరు కనిపించలేదు.  ఈ రెండు కాలనీలో  ప్రతి ఇంటికి తాళం వేసి కనిపించింది. ఏంటా ఆరా తీస్తే.. కీడు వంటలకు వెళ్లారని సమాచారం తెలిసింది.  కాలనీకి కీడు సోకింది.. ఆ దోషం పోవాలంటే  ఊరు వదిలి వెళ్లి చెట్లకింద వండుకొని తినిరావాలని కాలనీ వాసులు చెబుతున్నారు. 
కీడువంటల్లో భాగంగా కాలనీ వాసుల్లో కొందరు  సొంత బావులు, పొలాల దగ్గరకు వెళ్లగా.. కొందరు ఊరి బయట  చెట్లకింద, మరికొందరు ఊరికి సమీపంలోని షెడ్లకింద  కీడు వంటలు చేసుకున్నారు. 

వృద్దులు, చిన్న పిల్లలు సహా అందరూ  కీడు వంటలకు వెళ్లారు.  ఇక వంటల్లో కొందరు నాన్ వెజ్, మందు, బీర్లు ఎవరికి నచ్చింది వారు తెచ్చుకొని  ఎంజాయ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఊర్లకు కీడు సోకితే.. ప్రతి ఒక్కరు కీడు వంటలకు వెళితే దోషం పోతుందని నమ్ముతున్నారు కాలనీ వాసులు.