పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ప్రతిరోజూ లాగే ఆలయ అర్చకులు ఉదయాన్నే గర్భగుడి తలుపులు తెరిచారు. కానీ, లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. సాక్షాత్తు ఆ పరమశివుని మెడలోని నాగభూషణమా అన్నట్లు.. శివలింగం పక్కనే ఒక నాగుపాము ప్రత్యక్షమైంది.
శివలింగం చెంతన నాగుపాము ఉన్న విషయాన్ని గమనించిన అర్చకులు.. వెంటనే స్వామివారితో పాటు ఆ నాగుపాముకు కూడా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. గర్భగుడిలో నాగుపాము సాక్షాత్కరించిందనే వార్త చుట్టుపక్కల గ్రామాల్లో దావాగ్నంలా వ్యాపించింది. దీంతో భక్తిభావంతో ఉప్పొంగిపోయిన భక్తులు.. ఆ అద్భుత దృశ్యాన్ని కళ్లారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున సాంబమూర్తి ఆలయానికి తరలివస్తున్నారు.
శివలింగం పక్కనే ప్రశాంతంగా కూర్చున్న ఆ నాగుపామును చూసి స్థానికులు, భక్తులు భయపడకుండా.. స్వామివారి లీలగా భావించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆసక్తికరంగా మారడమే కాకుండా, రచ్చపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.
