శేఖర్ మాస్టర్ – జానీ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ.. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో హైడ్రామా!

శేఖర్ మాస్టర్ – జానీ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ.. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో హైడ్రామా!

టాలీవుడ్ లో మరోసారి డ్యాన్సర్స్ అసోసియేషన్ మధ్య వివాదం రాజుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల నమోదు, అంతర్గత పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

ఇటీవల జానీ మాస్టర్ వర్గం అసోసియేషన్‌లో కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ దృష్టికి విషయం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సభ్యులు కూడా రెండు వర్గాలుగా విడిపోయి తమ తమ నాయకులకు మద్దతు తెలుపుతున్నారు.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇదిలా ఉండగా.. ఈ వివాదంలో జానీ మాస్టర్ భార్య, అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అసోసియేషన్ వ్యవహారాల్లో ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కొందరు డ్యాన్సర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ అనుమతి లేకుండానే బైఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో అసోసియేషన్‌కు చెందిన దాదాపు పది మంది డ్యాన్సర్లు రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాల నుంచి పూర్తి స్థాయి అధికారిక స్పందన రావాల్సి ఉంది.. ప్రస్తుతం అసోసియేషన్‌లో నెలకొన్న విభేదాలను పెద్దలు చర్చల ద్వారా పరిష్కరించి, సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివాదానికి ముగింపు పలకాలని డ్యాన్సర్లు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు కోరుతున్నారు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.