కోరుట్ల, వెలుగు : ఒంటరిగా ఉంటున్న ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన కర్రె సునీత(34) కూలీ పని చేసుకుంటూ జీవిస్తోంది. రెండేండ్ల కింద భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఆదివారం సునీత ఇంట్లో గొడవ జరుగుతున్న గుర్తించిన స్థానికులు అక్కడికి వచ్చేలోగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై పరారయ్యారు. స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా... సునీత రక్తపు మడుగులో పడి చనిపోయి కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సురేశ్ బాబు, ఎస్సై కిరణ్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా, మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.
