ఆధ్యాత్మికం: విశ్వకర్మ పద్య సుధలు.. సమాజానికి అవసరమైన మంచి విషయాలు

ఆధ్యాత్మికం:  విశ్వకర్మ పద్య సుధలు.. సమాజానికి అవసరమైన మంచి విషయాలు

కరీంనగర్ జిల్లా వెదిర గ్రామ వాస్తవ్యులు తిప్పారపు లక్ష్మీనర్సయాచార్యులు.. విశ్వకర్మ శతకాన్ని రాశారు. సాధారణంగా శతక పద్యాలు నీతిని, భక్తిని, సమాజానికి అవసరమైన మంచి విషయాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తాయి. 

శతకంలోని ప్రతి పద్యం చివర ఒక నిర్దిష్టమైన పేరు, పదం, ఒక పాదం.. ఒకే విధంగా ఉంటుంది. ఈ శతకంలో కవి విశ్వకర్మను వెదిరలో దర్శించి ఆ సృష్టికర్తను సంభోదిస్తూ ‘వెదిర పుర నివాస విశ్వకర్మ’ అనే మకుటంతో ఈ పద్యాలను రాశారు. ఇందులో విశ్వకర్మను సంబోధిస్తూ రాసినప్పటికీ ఇది పూర్తిగా సామాజిక శతకంగా ఉండడం గమనార్హం. 


కవి తిప్పారపు లక్ష్మీనర్సయాచార్యులు వృత్తిరీత్యా వడ్రంగి పని చేస్తున్నప్పటికీ పద్య ప్రక్రియపై ఉన్న మక్కువతో చందోబద్ధమైన వివిధ రకాల పద్యాలను అలవోకగా రాయడం నేర్చుకున్నారు. భాషపై పట్టు సాధించి పద్యరచన చేస్తున్నారు. వీరి పద్యాల్లో పదకూర్పు, భావ సౌందర్యం బహు చక్కగా భాసిల్లుతోంది. అంతేకాక వివిధ వాట్సప్ గ్రూప్​ల్లో కవులు రాసిన వివిధ పద్యాలకు సమీక్షలు చేయడం, నూతనంగా పద్య రచన చేసే విద్యార్థులకు, వర్తమాన కవులకు సూచనలు ఇవ్వడం ప్రవృత్తిగా ఎంచుకుని సాహిత్య సేవను అందిస్తున్నారు. ప్రస్తుత విశ్వకర్మ శతకాన్ని కవి ఆటవెలది ఛందస్సులో అలతి అలతి పదాలతో రాశాడు. మచ్చుకు కొన్ని పరిశీలించి చూస్తే..

అంతరంగమందు నాశయమును నమ్మి
గట్టిపట్టుతోడ కదమువేయ
తలుపుతట్టు జయము తప్పక నరులకు
వెదిర పురనివాస విశ్వకర్మ!!

ఈ పద్యం మానవ ప్రయత్నం, పట్టుదల, ఆత్మవిశ్వాసాల ప్రాముఖ్యతను చక్కగా వివరిస్తోంది. మనిషి విజయం సాధించాలంటే మొదట తన మనస్సులో ఒక స్పష్టమైన ఆశయం లేదా లక్ష్యం ఉండాలి. కేవలం లక్ష్యం ఉంటే సరిపోదు, దానిపై పూర్తి నమ్మకం ఉండాలని, ​నిరంతర కృషితో ఏమాత్రం వెనకడుగు వేయకుండా దృఢమైన పట్టుదలతో శ్రమించి ఉత్సాహంతో ముందడుగు వేసినట్లయితే అలాంటి వారికి విజయం అనేది దానంతట అదే వెతుక్కుంటూ వస్తుందని తెలియజేశారు.

 ​సమాజంలో విజయం సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ పద్యం ఒక దిక్సూచి లాంటిది. ‘‘నమ్మకం, పట్టుదల’’ అనేవి విజయం సాధించడానికి మూ లసూత్రాలు అని ఈ పద్యం చాలా సులభమైన శైలిలో, లోతైన అర్థాన్ని ప్రబోధిస్తోంది.​

సబ్బు బిళ్లవోలె సజ్జనులందరు
తాము కరుగుచుండి తనువునంత
పరిమళింపజేసి పరవశమందేరు
వెదిర పురనివాస విశ్వకర్మ!!

సమాజంలో ఉండే ఉత్తములైన లేదా మంచి మనుషుల త్యాగ నిరతిని, పరోపకార గుణాన్ని ఈ పద్యంలో చెప్పారు. ‘అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం’ అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు కవి ఇక్కడ సజ్జనులను ‘సబ్బు బిళ్ల’తో పోల్చారు. సబ్బు తను కరిగిపోతూ, ఇతరుల మురికిని వదిలించి, వారికి సువాసనను ఇస్తుంది. 

అదేవిధంగా, సజ్జనులు కూడా సమాజశ్రేయస్సు కోసం, ఇతరుల మేలుకోసం తమ జీవితాన్ని, సుఖాలను త్యాగం చేస్తారు. సమాజానికి మేలు చేయడం కోసం ఎంతగా శ్రమించినా, తాము కష్టపడుతున్నా ఏమాత్రం బాధపడరు. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడంలో, వారిని సన్మార్గంలో నడిపించడంలోనే సజ్జనులు నిజమైన ఆనందాన్ని పొందుతారు. స్వార్థంతో కాకుండా, సమాజం కోసం బతికేవారే నిజమైన సజ్జనులని, వారి జీవితం సబ్బు బిళ్లలా ఇతరులకు సుఖాన్ని, సువాసన లాంటి మంచిని పంచుతుందని ​అద్భుతమైన ఉపమానంతో కవి చెప్పిన తీరు ప్రశంసనీయం. 

జ్ఞానితోడనెవరు ఘనముగా వాదించ
జ్ఞానమించుకైన కలుగు నిజము
వ్యర్థవాదనేల వదరుబోతుల తోడ
వెదిర పురనివాస విశ్వకర్మ!!

​మనం ఎవరితో చర్చలు జరపాలి? ఎవరితో జరుపకూడదు? అనే లోకరీతిని ఎంతో స్పష్టంగా బోధిస్తోంది ఈ పద్యం. జ్ఞానులతో చర్చల వల్ల ప్రయోజనం కలుగుతుంది. జ్ఞానం ఉన్న వ్యక్తితో మనం వాదించినా లేదా చర్చించినా, వారి మాటల ద్వారా మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. వారి మేధస్సు వల్ల మనకు కూడా కొంచెమైనా మంచి జ్ఞానం అబ్బుతుంది. 

ఇది మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఏ విషయమూ తెలియకుండా కేవలం అరుస్తూ, వాదించే వదరుబోతులతో వాదనకు దిగడం పూర్తిగా వృథా ప్రయాస. అలాంటి వారి వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా, మన మనశ్శాంతి కూడా పాడవుతుంది. వారి నుంచి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ‘‘జ్ఞానులతో చేసే వాదన కూడా ఒక పాఠం లాంటిదే, కానీ మూర్ఖులు లేదా వదరుబోతులతో చేసే వాదన కేవలం సమయాన్ని, శక్తిని వృథా చేయడమే’’ అనే పరమ సత్యాన్ని ఈ పద్యం వివరించింది.

పగలు రేయి కలిసి పరిపూర్ణదినమౌను
కాలగమనమందు క్రమముగాను
కష్టసుఖములున్న కమనీయ బ్రతుకౌను
వెదిర పురనివాస విశ్వకర్మ!

జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడటం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండటం ముఖ్యం. కష్టాలు, సుఖాలు అనే రెండు అనుభవాలు కలగలిసినప్పుడే ఆ బతుకుకు అందం ఉంటుంది. ఇది మానసిక స్థైర్యాన్ని ఇచ్చే ఒక గొప్ప తత్వ పద్యం. ‘‘కష్టాలు శాశ్వతం కావు, సుఖాలూ శాశ్వతం కావు.. పగలు తర్వాత రాత్రి వచ్చినట్లు, కష్టం తర్వాత సుఖం రావడం ప్రకృతి సహజ సూత్రం’’ అని గుర్తుచేస్తూ, జీవితాన్ని సమదృష్టితో స్వీకరించాలనే ఉన్నతమైన సందేశాన్ని కవి చాలా సరళమైన పదాలతో అందించారు.

బాధలందు తాను భగవంతుడై నిల్చి
యొడ్డు జేర్చువాడునొకడు చాలు
నూర్గురుండి యేల నూతిలో కప్పలై
వెదిర పురనివాస విశ్వకర్మ!

ఈ పద్యం నిజమైన స్నేహితుడు లేదా ఆపద్బాంధవుడి విలువను, అలాగే స్వార్థపూరితమైన లోకరీతిని సూటిగా, స్పష్టంగా వివరిస్తోంది. జీవితంలో కష్టాలు, బాధలు ఎదురైనప్పుడు మాటలతో కాకుండా, చేతలతో అండగా నిలబడే వ్యక్తి దేవుడితో సమానం. మనల్ని సమస్యలనే సముద్రం నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చే, నిజాయితీగా సాయం చేసే హృదయం ఉన్న ఒక్క వ్యక్తి మన పక్కన ఉన్నా చాలు, జీవితాన్ని ధైర్యంగా ముందుకు సాగించొచ్చు. ‘నూతిలో కప్పలు’ అనే లోకోక్తిని ఇక్కడ కవి చాలా అద్భుతమైన ఉపమానంగా ఉపయోగించారు.

 బావిలో కప్పలు ఇరుకైన ఆలోచనలతో, సంకుచిత స్వభావంతో ఉంటాయి. అలాగే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి సాయం చేయకుండా, కేవలం ప్రేక్షకులుగా చూస్తూ లేదా వెనకాడుతూ ఉండే వందమంది స్వార్థపరులు చుట్టూ ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే. వారివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సమాజంలోని నకిలీ బంధాల కంటే, విపత్కర పరిస్థితుల్లో తోడుగా నిలిచే ఏకైక నిజమైన బంధం మిన్న అనే నీతిని ప్రబోధిస్తోంది. ‘‘ఆపదలో ఆదుకునే ఒక్కడే వందమంది స్వార్థపరుల కంటే శ్రేష్టుడు’’ అనే సత్యాన్ని ఈ పద్యం హృదయానికి హత్తుకునేలా లోకానికి చాటిచెప్తోంది.

వచనమొకటి వ్రాయ వందలాదిగ యున్న
పద్యమొకటి వ్రాయ పదుగురున్న
సార్థకమ్మునొందు సాహితీలోకము
వెదిర పురనివాస విశ్వకర్మ!

కవి ఈ పద్యం ద్వారా పద్య కవిత్వం అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. ‘‘సులభంగా లభించే వంద వచనాల కంటే, కష్టపడి అల్లిన ఒకే ఒక్క పద్యం సాహిత్యాన్ని సమున్నత స్థానంలో నిలబెడుతుంది’’ అనే సందేశాన్ని ఈ పద్యం అందిస్తోంది.​

కవి సమాజం పట్ల లోతైన అవగాహనతో, లోకోక్తులను పద్య రూపంలో అందించడంలో సిద్ధహస్తుడని ఇందులోని పద్యాలను గమనిస్తే తెలుస్తుంది. చక్కని ఉపమానాలను తీసుకుని, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా సత్యాలను, నైతిక విలువలను అత్యంత సరళమైన శైలిలో పద్యాలను కూర్చారు. తిప్పారపు కలం నుంచి భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి రచనలు రావాలని ఆశిద్దాం!

రచయిత :  కందుకూరి భాస్కర్