- నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు
- ఏడాది దాటిన కార్పొరేషన్‌కు నిధుల కొరత
- వేధిస్తున్న క్యాడర్ కొరత
- ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టాలంటున్న స్థానికులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడి ఏడాది దాటినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదు. శానిటేషన్, వీధి లైట్లు, తాగునీటి సమస్య ప్రజలను వేధిస్తున్నాయి. కార్పొరేషన్‌కు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటివరకు ప్రత్యేక నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు క్యాడర్ స్ట్రెంథ్, పరిపాలనా యంత్రాంగం పూర్తిస్థాయిలో లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మేయర్, కమిషనర్ మధ్య విభేదాలు కూడా పరిపాలనపై ప్రభావం చూపుతున్నాయని కార్పొరేటర్లు పేర్కొంటున్నారు.
ఏడాది దాటినా నిధుల్లేవు..
కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ గతేడాది మే నెలలో ప్రభుత్వం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. అనంతరం 60 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్–సీపీఐ పొత్తుతో పాలకవర్గం ఏర్పడింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థి మూడ్ గణేశ్మేయర్గా ఎన్నికయ్యారు. అయితే కార్పొరేషన్‌గా ఏర్పడి ఏడాది పూర్తయినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన నిధులు రాలేదు. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాతనే కార్పొరేషన్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. కార్పొరేషన్ అయినందున ఉన్నత స్థాయి అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది.
లక్ష్యం చేరక నిధుల నిలిచివేత..
గత ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్ల లక్ష్యం చేరుకోకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు రూ.3 కోట్ల నిధులు నిలిచిపోయాయి. ఇప్పటికే నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్పొరేషన్‌కు ఈ నిధులు కూడా అందకపోవడంతో అభివృద్ధి పనులు మరింత మందగించాయి. నిబంధనలకు విరుద్ధంగా సీసీ రోడ్లు వంటి పనులకు జనరల్ ఫండ్స్‌ను వినియోగిస్తున్నారని కొందరు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలి..
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక దృష్టి సారించి కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
అధ్వాన్నంగా పారిశుధ్యం.. వెలగని వీధిలైట్లు
నగరంలో పారిశుధ్య పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. శానిటేషన్‌పై మేయర్, కమిషనర్ ఇద్దరూ తగినంత దృష్టి సారించడం లేదని, ఆకస్మిక తనిఖీలు లేకపోవడంతో పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. వీధిలైట్లు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులపైనా చాలాచోట్ల లైట్లు పనిచేయని పరిస్థితి నెలకొంది. తాగునీటి సమస్య కూడా నగరవాసులను నిత్యం వేధిస్తోంది. పరిశుభ్రమైన తాగునీటి సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలోని పార్కులు కూడా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కార్పొరేషన్లో మేయర్, కమిషనర్ మధ్య నెలకొన్న విభేదాలు పరిపాలనపై ప్రభావం చూపుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో అధికారులు, సిబ్బంది అయోమయంలో పడుతున్నారని తెలుస్తోంది.
