- ఎవరి లైన్లలో వారు వెళ్లకుండా ఇష్టారీతన ప్రయాణం
- లైన్క్రాస్ చేసేటప్పుడు నో ఇండికేటర్, నో సిగ్నల్
- ఫుట్‌పాత్‌లపై కూడా డ్రైవ్ చేస్తరు
- కఠిన శిక్షలు, జరిమానాలే పరిష్కారం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, వెడల్పాటి రోడ్లు ఎన్ని వచ్చినా ట్రాఫిక్ నరకం మాత్రం తప్పడం లేదు. మౌలిక వసతుల కొరత కంటే వాహనదారుల్లో ‘లేన్ డిసిప్లిన్’ (రోడ్లపై కేటాయించిన వరుసల్లో వెళ్లడం) లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. రోడ్డుపై గీసిన తెల్లటి గీతలు కేవలం అలంకారం కోసం వేసినట్లు భావిస్తున్నారు. ‘ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దూసుకుపోవాలి’ అనే డ్రైవింగ్ మైండ్‌సెట్ తో నగరంలో సగానికి పైగా ట్రాఫిక్ జామ్‌లు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాల ఇష్టారాజ్యం, బైక్ ల జిగ్‌జాగ్ ప్రయాణాలు ఈ గందరగోళాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి.
రూల్స్ ప్రకారం ఆర్టీసీ బస్సులు, స్కూల్, కాలేజీ బస్సులు ఎడమ వైపు లైన్లలోనే వెళ్లాలి. కానీ, అవి కుడి వైపు లైన్లను ఆక్రమించి అత్యంత నెమ్మదిగా వెళ్తూ రోడ్డంతా బ్లాక్ చేస్తున్నాయి. వీటికి తోడు రెండు కార్ల మధ్య ఇంచు ఖాళీ ఉన్నా సరే.. బైకులు, ఆటోలను వంకరటింకరగా నడిపిస్తూ మధ్యలోంచి దూసుకువెళ్లే వారి వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. లైన్ మారేప్పుడు కాదు కదా.. లెఫ్ట్ లేదా రైట్ టర్న్ తీసుకుంటున్నప్పుడు ఇండికేటర్ వేయాలని, హ్యాండ్ సిగ్నల్ చూపించాలన్న అవగాహన కూడా చాలా మందికి ఉండడం లేదు.
మనదంతా జిగ్‌జాగ్..
మన దేశంలో మోటార్ వాహనాల చట్టం ప్రకారం.. లారీలు, బస్సులు, ఎడమ వైపు లైన్లో, కార్లు, బైక్స్ మధ్య లైన్లో ప్రయాణించాలి.ఓవర్ టేక్ చేసే సమయంలో మాత్రమే లైన్ మారాలి. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే అదే లైన్లో వెళ్లాలి. కానీ లెఫ్ట్‌లో వెళ్లాల్సిన వాళ్లు రైట్లో.. రైట్లో వెళ్లాల్సిన వాళ్లు లెఫ్ట్‌లో.. ఇంకొందరు ఎక్కడ సందు దొరికితే అందులోంచి వెళ్లిపోతారు. కొందరు ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డప్పుడు ఫుట్‌పాత్‌లు, డివైడర్లపై నుంచి వెళ్లిన సందర్భాలున్నాయి.
పేరుకే జరిమానాలు..
మన దేశంలో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. లైన్ రూల్ బ్రేక్ చేస్తే రూ.500 నుంచి రూ.1,000 వరకు ఫైన్ వేసే అవకాశం ఉన్నప్పటికీ ఫీల్డ్ లెవెల్లో అమలు నామమాత్రంగానే ఉంది. ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్లు పెట్టుకోలేదని, నో-పార్కింగ్ లో బండి పెట్టారని చలాన్లు వేయడంపైనే దృష్టి పెడుతున్నారు. కానీ, లైన్ డిసిప్లిన్‌ను అస్సలు పట్టించుకోవడం లేదు. విదేశాల తరహాలో మన దగ్గర కూడా మెయిన్ చౌరస్తాల్లో, హైవేలపై అత్యాధునిక లైన్ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి భారీ చలాన్లు వేస్తేనే మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
సాలిడ్ వైట్ లైన్ గురించి తెలుసా?
రోడ్డుపై మధ్యలో కంటిన్యూగా తెల్లటి గీత ఉంటే, అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ లైన్మారకూడదు, ఓవర్ టేక్ చేయకూడదు. బ్రోకెన్ వైట్ లైన్ అంటే రోడ్డుపై తెల్లటి చుక్కల గీతలు(కట్ అయిన గీతలు) ఉంటే, సురక్షితంగా చూసుకుని లైన్ మారవచ్చు లేదా ఓవర్ టేక్ చేయవచ్చు.
మూడు లైన్ల రోడ్లు..
బెంగుళూరు-నాగ్‌పూర్ హైవే(ఎన్‌హెచ్-44) , విజయవాడ -ముంబై హైవే(ఎన్‌హెచ్-65)పై ఐటీ కారిడార్, గచ్చిబౌలి, మాదాపూర్ లోని ప్రధాన రోడ్లపై కుడి వైపు లైన్ లో కేవలం కార్లు మాత్రమే వెళ్లాలి. మధ్య లైన్ లో కార్లు, బైక్‌లు ప్రయాణించాలి. ఎడమ వైపు లైన్(స్లో లేన్). దీనిపై బస్సులు, లారీలు, నెమ్మదిగా వెళ్లే భారీ వాహనాలకు మాత్రమే అనుమతి.
డబుల్ లైన్ రోడ్లు..
నగరంలో ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ మెయిన్ రోడ్లు, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు, పాతబస్తీ ఇంటర్నల్ రోడ్లపై ఒకవైపు ప్రయాణానికి కేవలం 2 లైన్లు మాత్రమే ఉంటాయి. కుడి వైపు లైన్లలో కార్లు, వేగంగా వెళ్లే బైక్‌లు ప్రయాణించాలి. ఎడమ వైపు లైన్లలో బస్సులు, లారీలు, ఆటోలు నెమ్మదిగా వెళ్లే టూ-వీలర్స్ వెళ్లాలి. ఎప్పుడైనా ఒక లైన్ నుంచి మరో లైన్లోకి మారేప్పుడు తప్పనిసరిగా ఇండికేటర్ వేయాలి. మిర్రర్స్ చెక్ చేసుకోవాలి.
జర్మనీలో డిసిప్లిన్ అంటే డిసిప్లెనే..
జర్మనీలోని హైవేలపై కొన్ని ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్ ఉండదు. అయినా.. అక్కడ ప్రమాదాలు జరగకపోవడానికి కారణం వారి రైట్ -లేన్ రూల్. ఎంత స్పీడ్‌గా నడిచే కారైనా రోడ్డుకు కుడి వైపు లైన్లోనే ప్రయాణిస్తుంది. ఎడమ వైపు లైన్ కేవలం ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి మాత్రమే వాడతారు. ఒకసారి ఓవర్‌టేక్ పూర్తికాగానే తిరిగి కుడి లైన్లోకి వస్తుంది. అంతేకాదు, జర్మనీలో కుడి వైపు నుంచి ఓవర్‌టేక్ చేయడం నేరం. డ్రైవర్లందరికీ ఈ నియమాలపై అవగాహన ఉంటుంది.. పాటిస్తారు కూడా..
జపాన్ లో మిరాకిల్ కారిడార్
జపాన్ దేశస్తుల ట్రాఫిక్ డిసిప్లిన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అక్కడ ఎంతటి భారీ ట్రాఫిక్ జామ్ ఉన్నా అంబులెన్స్ లేదా ఫైర్ ఇంజిన్ వంటి అత్యవసర వాహనాల సైరన్ వినపడగానే రోడ్డుపై ఉన్న వాహనాలన్నీ రెండువైపులా పక్కకు జరిగి, మధ్యలో దారి ఏర్పాటు చేస్తాయి. దీనిని ‘మిరాకిల్ కారిడార్’ అని పిలుస్తారు. జపాన్ జనాలు రోడ్డుపై నడుస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదనే భావనతోనే ఉంటారు. అందుకే అక్కడ హారన్లు కొట్టడం, అనవసరంగా లైన్లు మారి వేరొకరిని ఇబ్బంది పెట్టడం వంటివి అస్సలు కనిపించవు.
