కేటీపీపీలో... బూడిద అమ్మకాలకు బ్రేక్.. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోతున్న నిల్వలు

కేటీపీపీలో... బూడిద అమ్మకాలకు బ్రేక్.. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోతున్న నిల్వలు
  • మార్చి 31తోనే ముగిసిన పాత టెండర్లు 
  • కొత్త టెండర్ల నిర్వహణలో ఆఫీసర్ల నిర్లక్ష్యం
  • జులై 1 నుంచి కొనుగోళ్లు ఆపేసిన బల్కర్ వ్యాపారులు
  • పీసీబీ నోటీసులిచ్చినా మారని కేటీపీపీ యాజమాన్యం

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) పరిధిలోని బూడిద డంప్ యార్డు లో నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. టెండర్ గడువు ముగిసి మూడు నెలలు దాటినా కొత్త టెండర్ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

 మరో వైపు పాత టెండర్ రేటు తమకు గిట్టుబాటు కావడం లేదంటూ బల్కర్ వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో ప్రతిరోజు వేలాది టన్నుల బూడిద డంప్ యార్డ్ కు చేరుకుంటోంది. బూడిద నిల్వలు పేరుకుపోతుండడంతో కేటీపీపీ పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

మార్చితోనే ముగిసిన టెండర్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ లోని కేటీపీపీ 1100 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ల నుంచి ప్రతి రోజు సుమారు 3 వేల టన్నుల బూడిద వెలువడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టెండర్లు నిర్వహించిన ఆఫీసర్లు టన్ను బూడిద రేటు రూ. 350గా నిర్ణయించారు. ఈ టెండర్ గడువు ఈ ఏడాది మార్చి 31తోనే ముగిసింది. 

అయినప్పటికీ కొత్తగా టెండర్లు పిలువకుండా.. పాత టెండర్లనే కొనసాగిస్తున్నారు. దీంతో కొత్త టెండర్లు తీసుకోవాలని బల్కర్ ఓనర్లు గత నెలలో జెన్ కో సీఎండీ హరీశ్ తో పాటు కేటీపీపీ సీఈకి వినతిపత్రం ఇచ్చారు. అయినా టెండర్ల నిర్వహణకు కేటీపీపీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

రేటు ఎక్కువగా ఉండడంతో...

కొత్త టెండర్లు నిర్వహించకపోవడంతో పాత టెండర్ దారులే బూడిదను లిఫ్ట్ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలోని ఇతర ప్లాంట్లలో టన్ను బూడిద రూ. 10 నుంచి రూ. 15 మధ్యే అమ్ముతుండగా.. కేటీపీపీలో రూ. 350కి అమ్ముతున్నారు. దీంతో రేటు తమకు గిట్టుబాటు కావడం లేదంటూ బల్కర్ వ్యాపారులు ఈ నెల 1 నుంచి బూడిద కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో కేటీపీపీ నుంచి వెలువడుతున్న బూడిదను దుబ్బపల్లి సమీపంలో డంప్ యార్డుకు తరలిస్తున్నారు. 

కొనుగోళ్లు జరిగే రోజుల్లో రోజుకు 1500 టన్నుల బూడిద బయటకు వెళ్లిపోయేది. ప్రస్తుతం కొనుగోళ్లు నిలిచిపోవడం, ప్రతి రోజు కొత్తగా బూడిద వచ్చి చేరుతుండంతో ఇప్పటికే ఒక డంప్ యార్డు పూర్తి స్థాయిలో నిండిపోయింది. దీంతో పక్కనే ఉన్న మరో యార్డ్ లోకి బూడిదను తరలిస్తున్నారు. రెండు యార్డుల్లో బూడిద నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కేటీపీపీ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు పక్కనే ఉన్న మోరంచవాగులోకి వదులుతుండడంతో నీరు కాలుషితం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పీసీబీ నోటీసులు ఇచ్చినా...

కేటీపీపీ పరిసరాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు బూడిద పాలవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిల్వలు 50 శాతానికి మించి ఉండడంతో రూ. 16 కోట్ల జరిమానా చెల్లించాలని నెల రోజుల కింద పీసీబీ నోటీసులు జారీ చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో సైతం పర్యావరణ కాలుష్యంపై పీసీబీ హెచ్చరించి జరిమానాలు విధించింది. కేటీపీపీ యాజమాన్యం కోట్లాది రూపాయల జరిమానాలు చెల్లిస్తున్నారే తప్ప.. తీరు మాత్రం మార్చుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు. 

కనిష్ట ధరతో టెండర్లు పిలవాలి  

కేటీపీపీ బూడిద విక్రయాలపై కనిష్ట ధరతో టెండర్లు పిలవాలి. టెండర్ గడువు ముగిసినా కొత్త టెండర్లు పిలవడం లేదు. ఇతర ప్లాంట్ల మాదిరిగా టెండర్లు  పిలవాలని జెన్ కో సీఎండీ, కేటీపీపీ సీఈకి గత నెలలోనే వినతి పత్రం ఇచ్చాం. బూడిద నిల్వలు ప్రమాదకర స్థాయిలో పేరుకుపోయాయి. మోరంచవాగు పూర్తిగా బూడిద వాగుగా మారుతోంది.

- శ్రీపతి సదానందం, బల్కర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, చెల్పూర్-