దివ్యాంగుల సంక్షేమానికి రెండేళ్లలో 28 కీలక నిర్ణయాలు : వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీరయ్య

దివ్యాంగుల సంక్షేమానికి రెండేళ్లలో 28 కీలక నిర్ణయాలు : వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీరయ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగుల కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులకు ఎంతో మేలు జరిగిందని ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. రెండేండ్లలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం 28 కీలక నిర్ణయాలను అమలు చేసిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉన్నతాధికారుల సహకారంతో.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా వేల సంఖ్యలో ఆధునిక సహాయక పరికరాలను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.

ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే ఇచ్చే వివాహ ప్రోత్సాహకాన్ని పెంచడంతో పాటు, గతంలో నిలిచిపోయిన పెండింగ్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసిందని వీరయ్య చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్న కఠిన నిబంధనలను సడలిస్తూ, దేశంలోనే మొదటిసారిగా కేవలం 40 శాతం వైకల్యం ఉన్న వారికి కూడా అత్యాధునిక పరికరాలు అందించేలా ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేశామని వివరించారు. ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు.