రాజకీయ జగడాలు మాని సాగు జలాలు ఇవ్వాలి..కాళేశ్వరంపై నీచ రాజకీయాలు..బూతు పురాణాలు వద్దు

రాజకీయ జగడాలు మాని సాగు జలాలు ఇవ్వాలి..కాళేశ్వరంపై నీచ రాజకీయాలు..బూతు పురాణాలు వద్దు
  •     సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సూచన

వనపర్తి, వెలుగు : రాజకీయ గొడవలు మాని సాగు జలాలు ఇచ్చేందుకు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం వనపర్తిలో జరిగిన సీపీఐ రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నీచ రాజకీయాలు, బూతు పురాణం సరికాదన్నారు. కాళేశ్వరం పిల్లర్లు కుంగుబాటును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించి సీడబ్ల్యూసీకి నివేదిక పంపినా ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోకపోవడం సరికాదన్నారు. 

కాళేశ్వరం విషయంలో రాజకీయ నిర్ణయాలు సరికాదని, సీడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణలోని ప్రాజెక్ట్ లను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని దాన్ని దాచి పెట్టేందుకే ప్రధాని మోదీ పొదుపు మంత్రం పఠిస్తున్నారని విమర్శించారు. సీపీఐ నేత జితేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల నరసింహ, రాష్ట్ర సమితి సభ్యులు వార్ల వెంకటయ్య, కేశవులు గౌడ్, వనపర్తి, నాగర్​కర్నూలు, గద్వాల, నారాయణపేట జిల్లాల కార్యదర్శులు విజయరాములు పాల్గొన్నారు.